• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Category Archives: వివిన రచనలు

వివిన మూర్తి కథలు, వ్యాసాలు, ఇతరాలు

రజనీకాంత్ గారి కోసం

23 గురువారం జూన్ 2016

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ఇటీవల కలిసినపుడు నా వ్యక్తిగతమిత్రులు రజనీకాంత్ గారు వెల్చేరు నారాయణరావు గారి కన్యాశుల్కం నాటకం ఆంగ్లానువాదానికి ముందుమాటపై నేను మిసిమి పత్రికలో రాసిన వ్యాసం ప్రసక్తి వచ్చింది. దానిని తను చూడలేదనీ పంపమనీ వారు అన్నారు. ఇది జరిగి చాలాకాలం అయింది. నిరాసక్తత, వయసుపోరు( మా రాయుడుగారి మాట అంటే ముదిమి లక్షణాలు) వల్ల వారికి పంపలేకపోయాను. ఈరోజు బొంబేలో ఉండి ఏదో రాసుకుంటుంటే అకస్మాత్తుగా గుర్తువచ్చింది. వారికి పంపేటపుడు చాలాకాలమయింది గదా బ్లాగులో పెడితే అనిపించింది. చివరికి మనసు కూడదీసుకుని ఆపని చేస్తున్నాను. రజనీకాంత్ గారితో బాటు ఆసక్తిగలవారందరి కోసం ఈ నా వ్యాసం..

ఒక చిన్ని మనవి. చర్చ సాగించటానికి విషయ పరిజ్ఞానంతో బాటు సహనం, పరస్పర గౌరవం, అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పటం తప్పనిసరిగా ఉండాలి. గెలవాలన్న తొందరలో ఎదుటివారి అభిప్రాయలకు- చర్చాంశానికి బాహిరమైన దోషారోపక కంఠస్వరంతో- జవాబివ్వటం రెచ్చగొట్టటం తప్పనిసరిగా ఉండకూడదు. తెలుగు సమాజం యొక్క పరిస్థితిని ఫేస్బుక్కు వంటి కొందరికే చెందిన సోషల్ మీడియా పూర్తిగా ప్రతిఫలించదనే నేను ఆశపడుతున్నాను. ఈ మీడియా చర్చకి అవసరమైన వాతావరణం కల్పించలేదని గట్టిగా అనిపించింది.  మౌఖిక చర్చలో ఆవేశకావేషాలను నియంత్రించుకోటం- లిఖితరూపంలోని చర్చలోకన్న- ఎక్కువ కష్టమనే నా అంచనా ఈ సోషల్ మీడియా చర్చలను చూసాక తప్పని తేలింది.  వెల్చేరు వారి ముందుమాటపై నాయీ వ్యాసం నా సాధారణ రాతలకూ అభిప్రాయాలకూ పూర్తిగా భిన్న మైనది. ఆలోచనాదోషాలు చూపే ధోరణికీ నేను ఇతరులకన్న అధికుడననే అహానికీ మధ్య దగ్గర సంబంధం ఉంది. ఎత్తిచూపవలసిన పరిస్థితులు ఉంటాయి. కాని నేను మాత్రం ఆపని ఎన్నడూ స్వీకరించలేదు. ఈ ఒక్క విషయంలో నేను నాకు తప్పదనిపించి ఈ వ్యాసం రాయటం, ప్రచురించటం కూడా చేసాను. ఇది వెల్చేరు వారితో చర్చను ఆశించి ఉద్దేశించి రాయలేదు. ఆ వ్యాసం చదివే పాఠకులకి నా అభిప్రాయం చెప్పే స్వరంతో రాసాను. నా మనవి ఏంటంటే లిఖిత చర్చలలో అది పదిమందిమధ్య జరిగేటపుడు ఆ చర్చలకు సామాజిక సద్వినియోగం ఉండాలంటే స్వయం నియంత్రణ, విషయస్పష్టత కోసం ప్రయత్న ం, మన జవాబు ఎవరికోసం ఉద్దేశించబడిందన్న ఎఱుక ఆ చర్చలో పాల్గొనే వారికి ఉండాలి. లేకపోతే తెచ్చుకోవాలి. సమాజం అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నపుడే చర్చలు కావాలి. యుద్దరంగంలో ఉన్నపుడు చర్యలే కాని చర్చలు ఉండవన్నదీ వాస్తవమే. కాని ఇపుడున్నది యుద్దరంగం కాదు. యుద్దరంగం అన్న ఉద్రేకం కలిగించే బైట పరిస్థితులే ఉన్నాయి. అరిచి, వివాదాస్పద వ్యాఖ్యానాలతో రాత్రికి రాత్రి వీరులయిపోవాలనే లక్ష్యంతో రాసే, మాట్లాడే వారు ప్రముఖంగా కనిపించటం ఉంది. ఆ ధోరణి సరైనది కాదనిపించే వారు పూనుకుని మాటలాడవలసిన సమయం వచ్చింది. కనక సామాజిక బాధ్యత, సత్యపట్ల గౌరవం అనేవి మాటలాడేవారికి ఉన్నపుడే ప్రయోజనకరమైన చర్చలు జరుగుతాయి. ఈ మనవిలో నా మాటలను నేను ఈ వ్యాసంలో ఎంతవరకూ పాటించానన్నది పాటించగలిగానన్నదీ విజ్ఞులు గమనించగలరు.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

నేను- ఫేస్బుక్కు ఫ్రెండ్ షిప్పు- పెర్వర్షన్స్

02 గురువారం జూలై 2015

Posted by వివిన మూర్తి in వివిన రచనలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

Facebook

30 6 15

రెండునెలలకు పైగా వ్యక్తిగత చికాకులు. నా ఆప్త స్నేహితులు కాళీపట్నం రామారావు గారు – మూర్తీ ఇబ్బందులు వేరు. కష్టాలు వేరు. పూడ్చుకోలేని నష్టమే కష్టం అంటారాయన. మిగిలినవన్నీ ఇబ్బందులు మాత్రమే – అంటుంటారు. అది అక్షరసత్యం అనిపిస్తుంది. ఈ స్థితిలో మనసు మళ్లించుకోటానికి మార్క్సు కాపిటల్ చదవటం ఆరంభించాను. చాలాకాలంగా వాయిదా వేసుకుంటున్న పని. మరో పని పాతపత్రికలలోంచి వ్యాసాలు తీసి బ్లాగులో అందించటం. కథానిలయం పనిలో డేటాబేస్ పని పక్కన పెట్టాను. 87వేల కథలు ఇండెక్సు చేసాను. వాటిని మా రమణమూర్తి గారి ఆధ్వర్యంలో పిడిఎఫ్ లుగా మార్చి కథానిలయం సైట్ లో ఉంచే పని జరుగుతోంది. ఇండెక్సు చేసే రోజులలో ఆసక్తికరమైన వాటిని ఓ సంచీలో వేసాను. వాటినే అందిస్తున్నాను. హఠాత్తుగా 3,4 రోజుల క్రితం ఫేస్బుక్ లో స్నేహితుల అభ్యర్ధనలను పోగేసి ఉంచిన సంగతి గుర్తు వచ్చింది.

వీటినన్నింటినీ పూర్తి చేయాలని పట్టుదల వచ్చింది. కూర్చున్నాను. ఈ అనుభవంతో నా ఆలోచనలు పంచుకోవాలని నా ఈ ప్రయత్నం.

ఆదమీ హుఁ ఆదమీ సే ప్యార్ కరతా హుఁ

బస్ వొహీ అపరాధ్ హర్ బార్ కరతా హుఁ

స్నేహం విషయంలో నాకు ఊహ తెలిసినదగ్గరనుంచీ నేను మనసుకి పట్టించుకున్న భావన ఈ పాటలో ఉంది. సమాజం యొక్క అభివృద్ది సామ్యవాద సమాజంలోనే ఉందని నేను స్థిరపరచుకున్న ఎడమ ఆలోచన. కాని కుడి వారైన ఆరెస్సెస్ వారితో సహా అందరితోనూ నేను స్నేహంగానే ఉంటాను. కుడి భావనల పుట్టుక కూడా మానవ సమాజంలోని సాంఘిక పరిస్థితుల నుంచే జరిగింది. ఈ భావనలు ఈ నేలవని, మార్క్సిజం పరాయి నేలదని కొందరు అంటే నేను నవ్వుకుంటాను.  అలాగే వారిని చదవటానికీ అర్ధం చేసుకోటానికీ నాకు అభ్యంతరం లేదు. ఏదీ నిషిద్ధం కాదు. అయితే ప్రియారిటీస్ ఉంటాయి. ఈ స్థితిలోని నేను స్నేహం విషయంలో నాఅంత నేను ఎవరినీ వదులుకోలేదు. కలవారనీ, ఇన్ఫ్లూయెన్స్ కలవారనీ నేనెవరికీ చేరువా కాను ప్రాధాన్యతా ఇవ్వను అలాగే వారినీ ఎడమూ పెట్టను.

ఇలా నేను స్నేహం విషయంలో అనుసరించినవన్నీ ఫేస్బుక్ స్నేహాల విషయంలో అనుసరించవచ్చా అన్నది ఒక అనుమానం. దానికి కారణం నా హాట్ మైల్ అకౌంట్ దొంగిలించబడటం. జిమైల్ అకౌంట్ అవకుండా జిమైల్ వాళ్లు రక్షించారు. ఆ అనుభవంతో ఉన్న నేను ఈ మాధ్యమంలో అడుగు పెట్టాక ఇన్ని అభ్యర్ధనలు చూసి ఏం చెయ్యాలో అర్ధం కాక తికమక అయ్యాను. మా అమరేంద్ర వాస్తవ స్నేహ ప్రపంచం చాలా పెద్దది. ఆ పెద్దమనిషి సాయంతో ఆయనకి తెలిసిన వారిని అంగీకరించాను ఓ మారు. నాకు ఏమాత్రం వినికిడి ఉన్నా అంగీకరించాను. కాని మనసు మూలుగుతూనే ఉంది. వాస్తవ స్నేహం విషయంలో ఎలాంటి నిబంధనలూ లేని నేను ఈ మాధ్యమ స్నేహం విషయంలో తప్పు చేస్తున్నానని.. అసలు హేకింగ్ భయం కాక వేరే సమస్యలున్నాయా..

ఎలా తేల్చుకోటం..

అందుకోసం 213 అభ్యర్ధనలను ఒకేమారు పరిశీలించే పనిలో పడ్డాను.

ప్రతి ఒక్క ప్రొపైల్ చూడటం చాలా శ్రమ. చాలావరకు చూసాను. నేను సాహిత్య సమూహం వాడిని కనక ఎక్కువమంది వారే అయుండాలనుకున్నాను. బంధువులు, నేను తెలిసిన మిత్రులు ఉంటారనుకున్నాను. కవిత్వం, కవిత్వం కొటేషన్లు, షేర్ చేసుకున్నవి ఆధారంగా సాహిత్య సామాజికులని గుర్తుపట్టాను. రకరకాల మనుషుల మధ్య తిరుగుతున్న ఫీలింగు. పోగా కొంతమందిని వారి చదువు, వృత్తిని బట్టి – సరే – చేసాను. అనేకమంది దేవుళ్ల బొమ్మలు పెట్టేవారు, భక్తి, వైరాగ్య శ్లోకాలు పెట్టేవారు ఉన్నారు. వ్యక్తిగతంగా దైవ విశ్వాసం, భక్తి వంటివి సహజం. వారిలో చాలామంది తమ భక్తిని చాటుకోవాలని చూస్తారు. కాకపోతే దైవం, మతం, జాతి, దేశం వంటి వాటిని కలగాపులగం చేసి ఆ భావాలను ఉగ్రంగా ప్రదర్శించే స్వభావం కొందరిలో కనిపిస్తుంది. మరీ అతిగా నాకు అనిపించిన వారు కొందరిని పక్కన పెట్టాను. మారుపేర్లతో ఉండేవారిని మొదట్లో ముట్టుకోలేదు. కొందరు సంస్థల పేర్లతో కనిపించారు. వారిలో  కొన్ని సరే చేసాను.

కొందరు సెక్సు బొమ్మలతో ఉంటే ఆ అభ్యర్ధనలను తిరస్కరించటమే కాకుండా స్పామ్ గా మార్క్ చేసాను.

అంతా అయాక-

192 సరే చేసాను. ఆ తర్వాత నా అనుభవం క్రింద ఇస్తున్నాను.

మెసెంజరులో కొంతమంది మెసేజ్ పెట్టటం జరిగింది. ఓపికగా జవాబు ఇచ్చినా ఏం కావాలో చెప్పకుండా విసుగించే వారు కొందరు. అలా అంగీకరించిన వారిలో ఒకాయన కుమార్ కరియా పేరుతో మెసేజ్ ఆరంభించారు. ఆయన బొంబైలో లెక్చరర్ గా పని చేసినట్టూ, కన్నూరులో ఉంటున్నట్టు ప్రొఫైల్ లో ఉంది. మా సంభాషణ క్రింద ఇస్తున్నాను.

Hello

Namste

how are you dear

Kaise ho

Not saying some thing !

Will u say something

Tuesday 11:13am

Good morning

21 hours ago

Murthy speak to me or else unfriend me

who r you what you want

My dear what u mean by asking so ? On F B guys who have over 5000 friends in their list , whom all know each other out side the F B ?

need not know but you should tell what you want

you

means

want you thats all

i do’t understand

Dear need you if u r over 60 yrs ?

what you need

you , wiill you give \

what

I love hot men over 60 yrs

Chat Conversation End

నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అన్ ఫ్రెండ్ చేసాను కాని ఇలాంటి అనుభవం ఇంకెవరికీ కలగలేదా ఇలాంటివి మామూలేనా..

చివరగా-

ఈ సామాజిక మాధ్యమం చాలా వేగంగా విస్తరించింది. దీనిని ఉపయోగించుకునే వారి  గురించి ఒక రిసెర్చ్ లో చెప్పిన విషయం ఏంటంటే ఎక్కువమందిలో ఆత్మన్యూనత కనిపిస్తుంది. ఇతర వార్తల ద్వారా దీని మాతృక అయిన ఇంటర్నెట్టులో పెర్వర్షన్స్ గురించి వింటూనే ఉన్నాం. నిజానికి ఇది చాలా శక్తివంతమైన మాధ్యమం. వార్తాపత్రికలు ఆరంభమైన దాదాపు రెండువందల ఏళ్లకి గానీ రేడియో రాలేదు. తర్వాత టీవీ వచ్చింది. ఈ మాధ్యమాలలో జనం పాల్గొనే అవకాశాలతో పోలిస్తే ఇంటర్నెట్టు, ఫేస్బుక్ ఆ అవకాశాలు చాలా పెంచింది. ఇది సామాజిక పరిణామంలో ఎంతవరకూ ఏ రకమైన క్రియాశీల పాత్ర వహిస్తుందో నాకు స్పష్టత లేదు. కాని క్రమంగా రాజ్యం స్వభావ నిర్ణయంలో ప్రజల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. అదే సమయంలో దీని విపరీత లక్షణాలు చూస్తే భవిష్యత్తుపై భయం కూడా కలుగుతోంది.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

నేరం- శిక్ష

01 ఆదివారం ఫిబ్ర 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు, వివిన రచనలు

≈ 7 వ్యాఖ్యలు

నేను లోగడ నేరం అనే కథ రాసాను. దానిలో శిక్ష వెనకనున్న భావనల చరిత్ర ఆలోచించాను. శిక్షలో క్రూరత్వం అన్నది మధ్యయుగాలలో ఎక్కువ అని నాకు అనిపిస్తుంది.దానికి కారణంఏమిటి.. చిన్ని సమూహాలలో అంటే గణాలలో, తెగలలో ఒక మనిషికి మరో మనిషితో సంబంధం, సంపర్కం ఉండేది. కనక తమ వాడే అయిన వ్యక్తికి తమవాడే అయిన మరో వ్యక్తి నష్టం కలిగించితే అదే నష్టం సమూహం అంతాకలిసి వాడికి ప్రతీకారంగా కలిగించటం అన్నది తోలి శిక్షారూపం. అందులో వినోదం పాలు తక్కువ. కాని క్రమంగా ప్రభుత కీ, పాలితుడికీ భౌతిక దూరం ఏర్పడ్డాక నేరస్తుడికి వేసే శిక్ష, నేరం యొక్క తీవ్రత ఆధారంగా, ఉండాలనే ఆలోచనా, శిక్షలో ఒక స్థాయీకరణా అన్న భావనా చోటుచేసుకున్నాయి. పర ప్రాంతాలకి వెళ్లి, వాళ్లు వచ్చి సంపర్కం పెరుగుతున్న దశలో పర వ్యక్తులని తమ వ్యక్తులుగా చూడలేని స్థితి వచ్చింది. ఇది మధ్యయుగాలలో పెరిగింది. అప్పుడే శిక్షలో వినోదం చోటుచేసుకుని లేదా దాని పాత్ర పెరగటం జరిగిఉండాలి. ఇది ప్రపంచమంతటా జరిగింది.

కాపోతే-

విజయంలో- బందీలపై జరిగే అమానుష లేదా అనాగరిక క్రూరత్వ ప్రదర్షనలో- వినోదం ఉంది. అది ఈనాడు కూడా తగ్గలేదు. కసి వల్ల కూడా క్రూరత్వం ఉంటుంది. కాని అసహాయంగా దొరికిపోయిన వాడిపట్ల ఎన్ని జెనీవా ఒప్పందాలు చేసుకున్నా ఇరాక్ ఖైదీలపై అమెరికన్ల నిర్భందంలో జరిగిన, జరుగుతున్న అనాగరిక క్రూరత్వం గమనించినపుడు మానవుడు ఈ పాశవిక దశ దాటలేదనే అనిపిస్తుంది. సరే శిక్షలో ఉండే వినోద క్రూరత్వం ఈ వ్యాసంలో గమనించినపుడు ఈ విషయంలో మానవుడికి స్థల కాలలతో నిమిత్తం లేదని అనిపించింది. గోవాలో ప్రసిద్ధ చర్చిలో, అవెన్యూ నగరం చర్చిలో (అని గుర్తు) ఈనాడు మనం మహనీయులుగా భావించేవారి పట్ల జరిగిన శిక్షల చిత్రాలు చూసి వాటికన్న ఒకమారు చంపి పారేసే మరణం ఎంత మంచి శిక్షో లేదా ప్రతీకారమో కదా అనిపించింది. కాఫ్కా పీనల్ కాలనీలో శిక్ష కోసం తయారు చేసిన యంత్రం కథ చదివి రెండు రోజులు మామూలు మనిషిని కాలేకపోయాను. ఈ వ్యాసం చదివినపుడు ఇలాంటి ఎన్నెన్నో విషయాసు, ఆలోచనలూ..ANDHRAJYOTHI_1966_06_05

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

kara 90-2

13 గురువారం నవం 2014

Posted by వివిన మూర్తి in కాళీపట్నం రామారావు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

kalipatnam, kara

ఈరోజు రెండు వ్యాసాలు అందిస్తున్నాను. గండికోట రఘురామారావు గారు కాళీపట్నం రామారావు గారి వద్ద చదువుకున్న విద్యార్ధి. ఈ 90ఏళ్ల పండగ రూపకర్త. విఖ్యాత చర్మవైద్యనిపుణులు. ఎంతో గౌరవంతో ప్రేమతో ఏనాడో చదువుకున్న మాస్టారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. వారి వ్యాసంలో, ఆనాటి మాస్టారు తన పనిలో చూపిన శ్రద్ధ, గమనించవలసిన అంశం.

రెండవ వ్యాసం ప్రఖ్యాత రచయిత కవనశర్మది. ఆయన మాస్టారి వద్ద చదువుకున్నారు. ఓ కొత్తపద్దతిలో ఈ వ్యాసం రాసారనిపించింది.నా మనసుని కదిలించినవ్యాసాలలో ఇది ఒకటి. gandikota-kavana

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

కారా గారి 90- 1

11 మంగళవారం నవం 2014

Posted by వివిన మూర్తి in కాళీపట్నం రామారావు, వివిన రచనలు

≈ 2 వ్యాఖ్యలు

ట్యాగులు

కారా మాస్టరు, కాళీపట్నం రామారావు, నవతీతరణం, వివినమూర్తి

కాళీపట్నం రామారావు మాస్టారు 90 సంవత్సరాలు నిండి 91లోకి అడుగుపెట్టారు. వారికీ సందర్భంగా ఆయనవద్ద చదువుకున్న విద్యార్ధులు నవతీతరణం పేరుతో ఒక అభినందన కార్యక్రమం నిర్వహించారు. దానికోసం వెలువరించిన అబినందన సంచిక వ్యాసాలు వరసగా అందించాలనుకుంటున్నాను. ఈరోజు నా ముందు మాట తో మెదలుపెడుతున్నాను.వివిన మూర్తి

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

gunturu kalyika viseshalu

19 గురువారం డిసెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ gunturu kalyika viseshaluపై వ్యాఖ్యలు నిలిపివేసారు

17-12-2013

భోజనాలు ముగిసాయి. గుంపులు గుంపుల కబుర్లు ముగిసాయి.
తిరిగి రాయుడు మరో ప్రశ్న లేవనెత్తారు. దానిపై వివరంగా మాటలాడారు.
కమ్యూనిస్టు అనుభవాలతో కేపిటలిజం చాలా నేర్చుకుంది. బలపడింది. 1972లో శామ్యూల్ పి. హంటింగ్ టన్ రాసిన political order in changing societies గురించి వివరించారు. 1965-66 నాటి పి.ఎల్.480 పధకం గురించి చెప్పారు. అభివృద్ధిని మదింపు చేయటంలో పరిమాణాత్మకంగా(qualititative) లెక్కగట్టటం ఆరంభించిన బాడెల్ పద్దతిని వివరించారు. ఆయుఃప్రమాణం, అక్షరాస్యత వంటి కొలబద్దలు వివరించారు. Agriculture, an unfinished business పేరిట నెహ్రూ పాలనలో ప్రపంచబాంకు ప్రతినిధి లెడ్లాన్సికీ రాసిన రిపోర్టుల గ్రంధాన్ని ప్రస్తావించారు. కమ్యూనిస్టులు ఎందుకు కేపిటలిస్టుల నుంచి నేర్చుకోలేకపోయారన్నది ఆయన ప్రశ్న.
దానికి ఉన్న ప్రతిబంధకాల గురించి కొంతమంది తమ ఆలోచనలు చెప్పారు. కమ్యూనిస్టులు రాజ్యం ఏర్పరిచిననాడు వారు ఇంటా బయటా ఎదుర్కొన్న సమస్యలూ, స్థిరపడటానికి చేసిన ప్రయత్నాలూ ప్రస్తావించారు. అధ్యయనంలో కేపిటలిస్టులకున్న అవకాశాలు రహస్య ఉద్యమాల వారికి లేకపోటం ఒక అభిప్రాయం.
అంజిరెడ్డి వివరంగా మాటలాడి అనేక విషయాలు చెప్పారు.
అద్యయనంలో వెనకబడిన మాట నిజమే. విలువల స్థాపన కోసం సమాజాల ప్రయత్నం 20వ శతాబ్ధంలో మొదలయింది.
అందులో 3 ప్రధాన ఘటనలు.
1919- సోషలిస్టు రాజ్యం స్థాపన
1930- ఆర్ధిక మాంద్యం
1991- సోషలిస్టు పతనం
1919లో పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రత్యామ్నాయం ఉందని స్పష్టమయింది.
1930 ఉత్పత్తికి తగిన గిరాకీ ఉంటుందని అప్పటి వరకూ ఆర్ధిక శాస్త్రం భావించింది. మాంద్యం వచ్చింది. కీయిన్స్ పరిష్కారం ఆర్ధిక వ్యవహారాలలో రాజ్యం జోక్యం. రాజ్యం గిరాకీ సృష్టించాలి. కరెన్సీ సృష్టించాలి. ఐరోపా దేశాలలో –శ్రేయోరాజ్య భావన- కీయిన్స్ భావాల ఫలితమే. కినీషియన్ డిమాండ్ మానేజ్మెంటు వల్ల శ్రేయోరాజ్యాలు సామ్యవాదం వైపు వెళ్లొచ్చన్న భయం క్రమంగా ఏర్పడింది. 1970ల వరకు వారు చేసిన వ్యవస్థాగత పరివర్తనం ప్రశంసించక తప్పదు. లాభాలలో కొంత భాగం తగ్గింది. ఆర్ధికాభివృద్ధిలో stagnation వచ్చింది. ధరలు పెరిగాయి. కినీషియన్ విధానాల వల్ల stagflation (high inflation and low growth) ఏర్పడింది అన్నాడు నోబుల్ లారెట్ మిల్టన్ ప్రెడ్ మాన్. -శేయోరాజ్యం సరికాదు. అది సామ్యవాదానికి సూచన. నైతికంగా అది పెట్టబడిదారీకి నప్పదు. ధరల నియంత్రణ వంటి రాజ్యం జోక్యాలు స్టాగ్నేషన్ కి కారణం. వ్యక్తుల నిర్ణయాలు హేతుబద్ధం కావచ్చు. పెట్టుబడిదారీ రాజ్యం హేతుబద్ధం కానవసరంలేదు. రాజ్యానికి జోక్యం చేసుకునీ అధికారం ఉండరాదు. 1978లో నయా ఉదారవాదం. శ్రేయోరాజ్యాన్ని కుదించే ప్రయత్నాలు చేసిన మార్గరెట్ ధాచర్ 4సార్లు వరసగా గెలిచింది. ఎందుకు ప్రజలు గెలిపించారు? Tax payer’s రాజ్యం కావటం వల్ల. నా పైసా వేరొకరికి ఉపయోగించే నైతిక అధికారం రాజ్యానికి ఎక్కడిదన్నది పన్ను చెల్లింపుదారుల ప్రశ్న. 1980ల తరవాత కీయిన్స్ దాదాపు బహిష్కరించబడ్డాడు.
హంటింగ్ టన్ కమ్యూనిస్టు వ్యతిరేకి. అమెరికా కలగచేసుకున్న దేశాలలో కమ్యూనిస్టు భావాలు పెరిగాయి. క్లాష్ ఆఫ్ సివిలిజేషన్స్ లో అతని వాదన గురించి చాలా వివరంగా చెప్పారు అంజిరెడ్డి. 21వ శతాబ్దంలో ప్రాశ్చాత్యదేశాలకు ప్రమాదం ఎక్కడనుంచి వస్తుంది?
1. యుగొస్లావియాలో భిన్న జాతుల మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి. కారణం భిన్న నాగరికతలు.
2.ఇస్లామిక్ నాగరికతే ప్రమాదకారి. వివిధ దేశాలలో ఉన్నా నాగరికతగా వారంతా ఒకటే. ఆధునికీకరణకీ నాగరికత విలువలకీ కుదరదు.
3. గణాంకాల ప్రకారం ప్రాశ్చాత్యదేశాల ఆధిపత్యం తగ్గుతోంది. చైనా, జపాన్, ఇండోనీషయా, మలేసియా వంటి ఆశియా దేశాల ప్రాబల్యం పెరుగుతోంది. 21వ శతాబ్దంలో ఆర్ధికంగా పుంజుకుంటూ రాజకీయ అధికారం ఆశిస్తాయి.
4. క్రిస్టియనైజ్ చేస్తేనే ప్రాశ్చాత్యుల అదికారం నిలబడుతుంది.
మనం సైద్ధాంతిక కృషి చేయాలి. అంటూ ముగించారు అంజిరెడ్డి.
కమ్యూనిస్టు పతనానంతరం ప్రపంచానికి కొత్త శత్రువు అవసరం అని హంటింగ్టన్ చెప్పటాన్ని రాయుడు వివరించటంతో కలయిక ముగిసింది.
సురేష్ ఆరంభించిన ఈ ఆలోచనాపరుల కలయిక ఆచరణకి సంబంధించిన ప్రతిపాదన చేయలేదని కొందరు సమావేశం తర్వాత అసంతృప్తి ప్రకటించారు. ఏమైనా వ్యక్తిగతంగా అనేక విషయాలు కలబోసుకున్నందుకు నాకు కొంత తృప్తి కలిగింది. ఇటువంటివి రాజకీయ అభిప్రాయ భేదాలు పక్కనుంచి కలిసి ఆలోచించే ప్రయత్నాలని నేను అర్ధం చేసుకుంటున్నాను. సైద్ధాంతిక కృషి నేటి అవసరమన్న అంజిరెడ్డి గారి మాటతో ఈ కలయిక విశేషాలను ముగిస్తున్నాను.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

గుంటూరు కలయిక విశేషాలు – 2

16 సోమవారం డిసెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ గుంటూరు కలయిక విశేషాలు – 2పై వ్యాఖ్యలు నిలిపివేసారు

ట్యాగులు

development, growth, marxism

15-12-13
కొంతమంది ఫోన్లుచేసి తిట్టటంతో ఆ రేపు ఈరోజు వచ్చింది.
గుంటూరు కలయిక 2
1. పటేల్ గారు
మిశ్రమ ఆర్ధికవ్యవస్థ నెహ్రూ ప్రభుత్వం చేపట్టటంతో మన అభివృద్ధి ప్రస్థానం మొదలయింది. ఈనాటి అసలు సమస్య ఉత్పత్తి కాదు పంపిణీ. ప్రభుత్వం పెట్టే ఖర్చు సామాన్యుడికి చేరటంలేదు. 1990లో విధ్వంసకర అభివృద్ధికి పునాది ఏర్పడింది. సాంకేతిక అభివృద్ధి ఫలాలు అందరికీ చేరటంలేదు. పేదరిక ప్రమాణం మార్చటం ద్వారా ప్రభుత్వలెక్కలు పేదరికం తగ్గినట్లు చూపుతున్నాయి. రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ప్రకారం ఇది ద్వంద్వ అబివృద్ధి. రూపాయ డిప్రిసియేషన్ ప్రభుత్వాన్ని నిస్పృహకి గురిచేస్తోంది.
2. రాంబాబు గారు
వ్యవసాయం దెబ్బతింది. గ్రామాలనుంచి వలసలు పెరిగాయి. భవిష్యత్తులో కేవలం వ్యవసాయంపై జీవించటం సాధ్యం కాదు. Speculative business అన్నిరంగాలలోనూ ప్రధానమయింది. సమాజంలో నైరాశ్యం ఎక్కువయింది. చిత్రమైన పరిస్థితి ఏంటంటే –పని చెయ్యటానికి మనుషుల్లేరు. మనుషులకు పనులు లేవు.- వైద్యం ఖరీదయింది. అభివృద్ధిలో అసమానతలు బాగా పెరిగాయి. విపరీతమైన జీతాల వారు చేయగలిగే ఖర్చులు భూమి ఖరీదు, ఇళ్లస్తలాల ఖరీదు పెంచేసాయి. పేదలకు ఈ విషయాలు వివరించాలి. వారిని కదిలించాలి. అందుకు ఏంచెయ్యాలో మనం ఆలోచించాలి.
3. అంజిరెడ్డి గారు
అభివృద్ధిని భిన్నకోణాలతో చూడవచ్చు. మానవుని కనీసావసరాలు తీరటం ఒక ప్రధాన కోణం అతని స్వేచ్ఛ మరో ప్రధాన కోణం.
గణాంకాల ఆధారంగా లెక్కవెయ్యటం ఒక పద్దతి. చారిత్రకంగా మూడు దశలలో మన దేశం ఆర్ధికస్థితిని పరిశీలించారు.
అ. వలసపూర్వ ఆర్ధికత(ఎకానమీ)
ఆ. వలసకాల ఆర్ధికత
ఇ. వలసానంతర ఆర్ధికత
1550కి పూర్వం చైనా, ఇండియాల జనాభా ప్రపంచంలో 75 శాతం. 11-15 శతాబ్దాలలో ప్రపంచ ఆర్ధిక వాటాలో ఈ దేశాలకు 50 శాతం ఉండేది. ఐరోపా దేశాల అభివృద్ధి 1750- 1820ల మధ్య హెచ్చింది. 1750 నుంచి 1913 నాటికి చైనా, ఇండియాల ఆర్ధిక వాటా 75 శాతం నుంచి 7 శాతంకి పడిపోయింది. వలస పాలనలో అభివృద్ధి బాగా క్షీణించింది. స్వాతంత్ర్యానంతరం తిరిగి మనదేశంలో అభివృద్ధి మొదలయింది. పారిశ్రామిక అభివృద్ది మొత్తం అబివృద్ధిలో ప్రదానమయింది.
అభివృద్ది సాధనలో, దాని స్వభావ నిర్వచనంలో రాజ్యం పాత్రని గమనించాలి. దిగువ వర్గాల కనీసావసరాలు తీరటంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఉపాధి కల్పన పధకాలు 1970ల నుంచి ప్రముఖపాత్ర వహించాయి. విద్య సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. అది సేవారంగానికి అవసరమైన నైపుణ్యాలు పెంచింది.
వామపక్ష ఆలోచనలలోనూ, విద్యావ్యవస్థలోనూ మార్పులు రావాలి. సాధ్యమైన మార్పులు ఏమిటో ఆలోచించాలి.
6. సి.ఎస్.ఆర్. ప్రసాద్
చర్చకు స్పష్టతలేదు. రాయుడు గారి ప్రతిపాదనతో నాకు భిన్నాభిప్రాయం ఉంది. బేసిక్ అవసరాలు తీరితే సరిపోదు. వైద్యంలో అందరికీ సమాన అవకాశాలు లభించాయని రాజీవ్ ఆరోగ్య పధకం చూపించి అంటున్నారు. అది ఎటువంటి సమానత్వమో అందరికీ తెలుసు. విద్యావకాశాలు అందరికీ లభించాయనుకోటం సరికాదు. సోషలిస్టు సమాజాన్ని కోరుకోటం అంటే సోషలిస్టు మానవుడిని కోరుకోటం. ఎకనామిక్ నీడ్స్ మాత్రమే చూడటం వల్లనే రష్యాలో ఆర్ధిక వ్యవస్థ విఫలమయింది.
7. ఎన్. అంజయ్య
అభివృద్ధి నమూనాలో మన దేశానికి స్పష్టత లేదు. రాజ్యాంగం మనది సోషలిస్టు రిపబ్లిక్ అంటుంది. ఆదేశ సూత్రాలు భిన్నంగా ఉంటాయి.
గ్రామాలలో పశుసంపద తరిగిపోటం, వ్యవసాయంలో యాంత్రికీకరణ పెరగటం, శ్రామికుల వలసలు వంటి మార్పులను వ్యవసాయరంగంలో పతనంగా చూస్తున్నాడు విద్యాసాగర్. వ్యవసాయ సంక్షోభానికి కారణం మనం ఎంచుకున్న అభివృద్ధి నమూనా.
దాని ఫలితంగానే ప్రత్యామ్నాయ పధకాలు లేకుండా వ్యవసాయరంగం నుంచి శ్రామికులను తరిమెయ్యటం జరుగుతోంది. సేవారంగం అనేది విస్తరిస్తోంది అంటే అర్ధం ఇతర దేశాలకు మన సేవలు విస్తరిస్తున్నాయనే. ఐరోపా దేశాలు బాగుపడ్డాక తమ పనులు చవకకూలితో మన చేత చేయించుకోటమే సేవారంగం. దానికి కావలసిన విద్యను మనం మన డబ్బులు పోసి నేర్చుకుంటున్నాం. శాస్త్రపరిశోధనా రంగంపై చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. ఐఐటీలు విదేశాలకు సేవలు చెయ్యటానికి ఉపయోగపడుతున్నాయి.
మనది స్పెక్యులేటివ్ ఆర్ధిక నమూనా.
8. జి.ఎస్. రామ్మోహన్
పంపిణీ వ్యవస్థ మెరుగుపడిన చోట ఉద్యమాలు బలహీనపడుతున్నాయి.
నాగళ్లు పోవటం వల్ల బద్వాన్ లో కులం పోయింది.
రాయుడు ప్రతిపాదించిన తరహా సమానత్వం స్వంత ఆస్తిని అంగీకరించుతుంది.
అన్ని ప్రాజెక్టులనీ వ్యతిరేకించటం వల్ల ఎనర్జీ అవసరాలు తీరవు.
పేదరికం తగ్గింది కాని అసమానతలు బాగా పెరిగాయి.
కులానికీ, వృత్తికీ ఉన్న సంబంధం తెగిపోయింది.
పూర్వం పుట్టుకతో గుర్తింపు ఉండేది. ఇప్పుడు సంపాదించుకున్న వస్తువులు గుర్తింపుని ఇస్తున్నాయి.
ప్రస్తుతదశలో అసమానతలు అమానవీయంగా పెరిగాయి.
9. శ్రీనివాసరావు
వలసపాలనలో అభివృద్ధి మౌలికమైనది కాదు. దానినే స్వాతంత్ర్యానంతరం అనుసరిస్తున్నాం. సొంతఆస్తి రద్దు కానిదే మౌలికమైన అభివృద్ది సాధ్యంకాదు. వ్యవసాయరంగం ధ్వంసం చేయబడింది. 1930ల ఆర్ధికమాంద్యం గురించి ప్రస్తావించారు.
10. రామలక్ష్మి
రాయుడు గారు చెప్పిన ఆహార లభ్యతలో సమానత్వం మనం చూడవచ్చు. విద్య వైద్య రంగాలలో సమాన అవకాశాలు ఇంకా పెరగాలి. ఆర్ధిక అసమానత్వం, అవినీతి బాగా పెరిగాయి. అవినీతి సూచికలో మనం పైస్థానంలో ఉన్నాం.
11. పద్మావతి
గ్రామాలకూ బస్తీలకూ తేడా తగ్గుతోంది.
12. వివిన మూర్తి
ఈకలయికలో సురేష్ ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియదు. అదెంతవరకూ నెరవేరిందో అతనే చెప్పాలి.
రాయుడు గారు ఆరంభించిన చర్చ కొనసాగలేదు. అభివృద్ధి దశ, దిశ ఆయన మాటల వెనుక ఉన్నాయి. దానిచుట్టూ అందరూ తమ ఆలోచనలు చెప్పటం వల్ల అనేక కొత్త సంగతుల నేను తెలుసుకోగలిగాను. ఆయన అంటున్నట్టు కూడూ, గుడ్డా, గూడూ అవసరాలు జనానికి తీరినట్టు చాలామంది ఒప్పుకుంటున్నారు. అవి మాత్రమే చాలవని వారిలో చాలామంది అభిప్రాయం.
చారిత్రకంగా జనంయొక్క ఈ కనీసావసరాలు తీరే క్రమం ఒకటి మానవ ప్రస్థానంలో  గుర్తించవచ్చు. దీనిని మన పాలకులు పూనుకుని సాధించారని నేను అనుకోలేను. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రయోగాల, ఆలోచనల వల్ల జనం అవసరాలు తీర్చటంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టక తప్పలేదు. అది స్థూలంగా మార్క్సిస్టు విజయమే.
అంజిరెడ్డి గారు చెప్పిన చారిత్రక దశలలో గణాంకాలకు ఆధారం ఏమిటో, అవి ఎలా లెక్కకట్టారో నాకు బోధపడలేదు.
ప్రొలిటేరియట్ ని కంజ్యూమర్ గా అర్ధం చేసుకోవటం కేపిటలిస్టుల విజయ ప్రస్థానంలో ముఖ్యమైన మలుపు.
భవిష్యత్తులో అగ్రికల్చర్ లో కూలి, రైతు, భూస్వామి అన్న విభజనకి అవకాశం ఉండదు. యజమాని, కూలీ లేదా ఉద్యోగి మాత్రమే ఉంటారు.
భారతదేశానికి ప్రత్యేకమైన అభివద్ధి నమూనా అనేది ఏనాడూ లేదు. ఇపుడు ఏదేశానికైనా అలాంటిది సాధ్యమని నాకు అనిపించటంలేదు. మన పాలకులు స్వాతంత్రానంతరం ప్రపంచబాంకు సలహాలను పాటించారు. ఇప్పుడు వారి ఆదేశాలను పాటిస్తున్నారు. రాజకీయంగా సార్వభౌమత్వం అనేది అధికారాలు లేని ఉద్యోగ స్థాయిలో ఉంది.
మానవ ప్రస్థానం స్వేచ్ఛా మానవుడి వైపు సాగాలి. సాగుతోంది.
( ఇవి నేను మాటలాడుదామని రాసుకున్నవి. ఎంతవరకూ మాటలాడానో, ఎవరికి ఎలా అర్ధమయిందో నాకు తెలియదు. ఇతరులు మాటలాడిన వాటిలో నేను నోట్ చేసుకున్నవి చెప్పాను. ఇందులో నా గ్రహణ, వివరణా సామర్ధ్య లోపాలు ఉండే అవకాశం ఉంది.)
దీని తరవాత అందరం భోజనాలమీద పడ్డాం. ఆతర్వాత విషయాలు ఆ తర్వాత భాగంలో..

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

గుంటూరు కలయిక విశేషాలు

09 సోమవారం డిసెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ 2 వ్యాఖ్యలు

9-12-2013

నాకు సురేష్ అనే ఆప్తమిత్రుడు ఉన్నాడు. అతను కొంతకాలం బెంగళూరులో ఉన్నాడు. టైటానిక్ కథతో ప్రసిద్ధుడు. ఆతగాడు నాకు ఓ పజిల్. నాకు తెలిసినమేరకు నాలాగే సమాజం గురించి ఆలోచిస్తాడు. ఆ ఆలోచనతోనే కథకులను అపుడపుడు కలిపి మాటలాడించే ప్రయత్నం లేదా కార్యక్రమం ఒకటి చేస్తుంటాడు. డిసెంబరు 1,2 తేదీలలో అతను కొందరు ఆలోచనాపరులను కలిపే ప్రయత్నం చేసాడు. గుంటూరులో ఈ సమావేశం జరిగింది. దానికి నేనుసైతం వెళ్లాను. చాలామంది ప్రసిద్ధులను కలవటం, రాయుడుగారి సాయంకాల ఆతిధ్యం, రాత్రి కబుర్లు వగైరాలతో బాగానే కాలం దొర్లింది. కాలం దొర్లించదలుచుకుంటే ఇంతమంది కలిసి కష్టపడ నవసరం లేదు గదా! అంతకుమించి ఏదో జరగాలన్నది సురేష్ ఉద్దేశ్యం అన్నది విదితం.

అదేమిటి? ఎంతవరకు నెరవేరింది?

ఈ సమావేశం గురించి నలుగురితో పంచుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నేను కొంత నోట్సు రాసుకున్నాను. సురేష్ మీరు రాస్తే బాగుంటుందని కూడా సూచించాడు. కాని ఎలా పంచాలి? ఏం పంచాలి? చివరకు నా దృష్టికోణం తోనే అని నిశ్చయించుకుని, నా బద్దకాన్ని వదిలించుకుని ఈ రోజు మొదలిస్తున్నాను.

సురేష్ పజిల్ అన్నది నాకు చాలాకాలంగా ఉన్నదే. ఈ సమావేశం ఏర్పాటులో అతని ఉద్దేశ్యం లేదా లక్ష్యం లేదా యోజన అతనితో మాటాడాక కూడా నాకు స్పష్టం కాలేదు. అతను అన్నదాని ప్రకారం రాయుడు గారితో పిచ్చాపాటీ, లేదా ఓ రోజు లాంటి పేరు ఈ సమావేశానికి ఉంచాలనుకున్నాడు. రాయుడు దానిని అంగీకరించలేదు. ఆయన పట్ల సురేష్కీ మామిత్రబృందంలో ఇతరులకి ఉండే సాధారణ అభిప్రాయం ఆయన భిన్నంగా ఆలోచిస్తారు. సమాచారం(data) ఆధారంగా మాటలాడతారు. లోకంలో పేదలు, పెద్దలు అనే విభజన, అసమానత ఉందనేది వాస్తవం. ఈ ఉండటమనేది అవాంఛనీయమనేది, ఉండకుండా చేయటం సాధ్యమనేది కొందరు నమ్ముతారు. వీరిలో ఎక్కువమందిని కమ్యూనిస్టులు అనవచ్చు. రాయుడు గారు కూడా అవాంఛనీయమని భావిస్తారు. అది తగ్గుతున్నదనే అంశాన్ని సమాచారం ఆధారంగా చూపిస్తారు. మౌలికంగా ఆయన భిన్నత్వం అక్కడ ఉంది. (రాయుడి విషయంలో నాకున్న స్పష్టత ఉంది.) దానిని సురేష్ అలాగే అర్ధం చేసుకున్నాడనే నా ఊహ. ఈ విషయాన్ని –other point of view- అని సురేష్ అనుకుంటున్నాడని నేను  అనుకుంటాను. అంటే ఈ భిన్న దృష్టికోణాన్ని (రాయిడి భాషలో ప్రాపంచిక దృక్ఫధం) సురేష్ ఎవరికి పరిచయం చేయదలుచుకున్నాడు?

సమావేశపరిచిన వారిలో ఎక్కువమంది కమ్యూనిస్టులు, కమ్యూనిజం ఇష్టులు. వారిలో ఆలోచనా రంగంలో మాత్రమే పని చేస్తున్నవారు, ఆచరణ రంగంలో పనిచేసిన వారు, చేస్తున్నవారు ఉన్నారు. వారందరికీ ఒక సమస్య ఉంది. What to do? What to think? ఇది సురేష్ కి కూడా ఉంది. ఈ భిన్నదృష్టికోణం యొక్క పైపై ఊహలు పక్కనుంచి,  దీని లోతు పరిశీలించవలసిన అగత్యం ఉందని సురేష్ అస్పష్ట భావం. అప్పుడు ఒక మధనం ఆరంభం అవొచ్చన్నది అతని ఆశ కావచ్చు.

సురేష్ ఆలోచించవలసిన విషయాలు రాయుడి ఆధారంతో పట్టీ తయారుచేసాడు. వాటిని చదివి సమావేశాన్ని ఆరంభించాడు. దాముని ఈ సమావేశానికి మోడరేటర్ అన్నాడు. తర్వాత రాయుడిని ఆరంభించమన్నాడు. ఆయన మా బెంగళూరు పద్దతిలో స్పష్టంగా ఆరంభించారు.

-మాటలాడుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వ్యవసాయం ప్రధానమైనది. 94-95లో డంకెల్ ఆతర్వాత గ్లోబలైజేషన్ వ్యవసాయం ఎకనమిక్సులో మార్పులు తెచ్చాయి. వాటి మంచిచెడ్డలను చర్చించే ముందు కొన్ని ప్రశ్నలు. సోషలిస్టు సమాజం ఎలా ఉంటుంది? సమానత ఎందులో ఉండాలి? ఎందులో సాధ్యం?

అ. కనీస అవసరాలు. కూడు, గూడు, గుడ్డ లేదనే పరిస్థితి పోవాలి. దానికి తగిన ఉత్పత్తి ఈనాడు భారతదేశంలో ఉంది. దానిని అందరికీ పంచే పంపిణీ వ్యవస్థలో సమస్య ఉంది. దీనిలో సమానత అవసరం, సాద్యం.

ఆ. జీవిత అవసరాలు. విద్య, వైద్యం అందరికీ అందాలి. ఏదోరూపంలో అవి ఈనాడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి.

ఇ. జీవనశైలి అవసరాలు. ఉండే ఇల్లు , ధరించే బట్ట, ప్రయాణం చేసే వాహనం వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటిల్లో మార్పులు ముందు పైవారి నుంచే మొదలవుతాయి. క్రమంగా అవి క్రిందవారికి చేరతాయి. ఉదాహరణ టూత్ పేస్టు వాడకం.. ఫోను.. వంటివి. వీటిలో సమానత ఆవసరమూ కాదు. సాధ్యమూ కాదు.

దీనిమీద ముందు రౌండ్లో చర్చిద్దాం.

ఇలా ఆయన చేసిన ఆరంభానికి ఎవరేమన్నారు?

రేపు రాస్తాను.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

Poverty reduction and sustainable energy

23 సోమవారం సెప్టెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

harish hande

2. బొంబే వచ్చింతర్వాత పై విషయం గురించి ఉపన్యాసం ఉందని పోస్టరు చదవి తెలుసుకున్నాను. చిత్రంగా ఉందీ అంశం.. తప్పకుండా వెళ్లాలనుకున్నాను. మాటలాడేది హరీశ్ హందే. కర్నాటకలోని కుందాపురంలో పుట్టి, రూర్కెలాలో పెరిగిన ఈయన ఖరగపూర్ ఐఐటిలో ఎనర్జీ ఇంజనీరింగులో బిటెక్ చదవాడు. తరవాత అమెరికా మసాచుసెట్స్ విశ్వవిద్సాలయంలో పిజి, పిహెచ్ డీ చేసి భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1995లో SELCO అనే సామాజిక వ్యాపారసంస్థను బెంగళూరులో స్థాపించాడు. ఈ సంస్థకి కర్నాటక, మహరాష్ట్ర, బీహార్, గుజరాత్, తమిళనాడులలో 38 ఎనర్జీ సేవా కేంద్రాలు ఉన్నాయి. గ్రామీణ భారతంలో సౌరశక్తిని వినియోగించి పేదప్రజలకి ఉపాధి కల్పనలో, ఆదాయం పెరగటంలో సహాయం చేయటం ఆయన చేపట్టిన కార్యక్రమం. రామన్ మెగాసెసే అవార్డుతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ బహుమానాలు పొందిన ఈ social entrepreneur ఉపన్యాసం వినటం ఒక అనుభవం. సుమారు 500 పట్టే సభాంగణం నిండిపోయింది.

ఆయన చెప్పిన కొన్ని అనుభవాలు, ఆలోచనీయ అంశాలు పంచుకోవటం రెండవ బాకీ.
అ. ఒక వీధివ్యాపారి సంగతి. ఉదయం 1000రూ. అప్పు తీసుకోటంతో ఆరంభం. అందులో 100 వడ్డీ అప్పుడే తీసుకుంటారు. 900 వందలతో సరుకు కొని వీధి వీధీ తిరిగి అమ్ముకుంటాడు. అందులో పోలీసు మామూలు, రౌడీ జులుం 100. బండి అద్దె 50. సాయంకాలం మిగిలిన సరుకు నిలవ వేసుకొనే సదుపాయం లేదు. ఏదో ధరకి అమ్ముకోవాలి. కనీసం 200 నుంచి 300 సంసారపోషణకి కావాలి. ఇతను చేసే సేవ ఇంటింటికీ సరుకు చేర్చటం. ఇతనికి ప్రభుత్వం.. ఏమైనా సహాయపడుతోందా .. వీళ్లకి పోటీగా ఉండే మాల్స్ కి లభించే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, 5, 6 శాతం బాంకు రుణాలు లెక్కవేయండి సబ్సిడీలు ఎవరికి అందుతున్నాయి.
ఆ. నేను ఐఐటిలో ఎలా చదివాను.. ఎంత సబ్సిడీ ఫొందాను.. ఆ ధనం ఎవరిది.. పేదల నుంచి నేరుగానూ, మరో రూపంలోనూ ప్రభుత్వం పోగుచేస్తున్నది కాదా.. దానితో లాభపడిన నేను ఎవరికి లాభపడాలి.. ఎవరి లాభాలకి ఉపయోగపడుతున్నాను..
ఇ. నేను మలేసియా, శ్రీలంక, ఆఫ్రికా లలో పేదల మధ్య పనిచేసాను. ప్రపంచంలో పేదలు ఎక్కడున్నా వారికి నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే ప్రపంచంలోని పేదలు పోగుచేసిన సంపదతోనే నేటి విద్యావ్యవస్థ ఏర్పడింది. అందుకే నా దేశంలో పేదలకి మాత్రమే పరిమితం కావాలనుకోను. నా నైపుణ్యం వీరికి ఎలా ఉపయోగించటం..
ఈ. బీహార్ లో పని చేయటం చాలా కష్టం అంటారు. ముంగేర్ జిల్లాలో మూడేళ్లుగా పని చేస్తున్నాను. వారికి నా టెక్నాలజీతో 1200 గ్రామాలకు విద్యుత్తు ఇవ్వగలిగాను. ఒక గ్రామంలో ఆకులు కుట్టటం వృత్తి. వారు ఒకరోజు ఆకులు పోగుచేస్తారు. మరునాడు మాత్రమే కుట్టగలుగుతారు. రాత్రి దీపం వల్ల వారు రెండురోజుల పని ఒకరోజులో చేయగలిగారు.
ఉ. వ్యవసాయంలో నిపుణులు పనిచెయ్యటం లేదంటారు. పనిచేస్తున్న వారెవరు? జీవితమంతా అక్కడ పని చేస్తున్నవారి అనుభవానికీ, వారు పెంచుకున్న నైపుణ్యాలతో పోలిస్తే 4,5 ఏళ్లు చదివిన వారు ఏ పాటి? ఈ దృష్టికోణంలో తప్పు కనిపించటం లేదా.. మేం చెయ్యవలసింది వారివద్ద నేర్చుకోటం.. వారి అవసరాలకు కావలసిన పరికరాలు డిజైన్ చేయటం.
ఊ. నాకూ, నీలిమా మిశ్రాకు కలిపి రామన్ మెగాసెసే అవార్ఢు ఇచ్చారు. న్యాయంగా అది ఆమెకు మాత్రమే రావాలి. నా అమెరికా చదువు, నా ఇంగ్లీషుల వల్ల నేనందులో వాటా చిక్కించుకున్నాను. మనదేశంలో ఇంగ్లీషుకి ఉన్న విలువ ఇలాగే ఉండాలా అంటూ చాలా సంగతులు చెప్పారు.
ఎ. ఒక అబ్బాయి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంచి ప్రశ్న వేసాడు. మా తలిదండ్రులు మా జీవితాలు సుఖంగా ఉండాలని ఐఐటిలకి పంపుతారు. యంత్రాలలా మేం చదువుతాం. మేం మాగురించి తప్ప మరి దేని గురించైనా ఆలోచించే మోటివేషన్ ఎలా వస్తుంది? దానికి హరీష్ సమాధానం – ప్రశ్నతో నిరసన చేయటం మనకి అలవాటయింది. జవాబుతో నిరసన మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ ప్రశ్న నీకు కలిగాక జవాబు నువ్వే ఆలోచించాలి. ఉదాహరణకి నువ్వు స్కూల్స్ లో విద్యార్ధులకి మోటివేషన్ అవసరం చెప్పవచ్చు. నీ పిల్లలని ఈ విషవలయం నుంచి తప్పించవచ్చు. ఇవి కేవలం ఉదాహరణలు.
గుర్తున్నమేరకు చెప్పాను.
ఒక పెనుమార్పుతో అనేక రంగాలలో మార్పుల గురించి ఆలోచించే మనిషిని నేను. అనేక మార్పుల గురించి మాటలాడేవారు అసలు మార్పు జాప్యానికి తోడ్పడతారని విన్నవాడిని. నా వివేచనా స్వభావం వల్ల ఆకలిగా ఉన్నపుడే(అవసరాల వల్లే) పెనుమార్పులు సాధ్యమన్న అంచనాలో పొరపాటుందని అనుకునే మనిషిని. మనిషి ఎదగాలని కలలు కనటం ఓ స్థాయి తరవాతనే సాధ్యం అని నేను కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. ఆ స్థాయికి చేరిన వారిని రాజ్యం ఒకరికి ఒకరికి శత్రువుని చేయటంలో ప్రస్తుతం ముందంజలో ఉంది. కాని అదిక సంఖ్యాకులు కలలు కనే స్థాయికి చేరాక రాజ్యం స్వభావం మారక తప్పదు. ఇటువంటి సామాజిక ఆలోచనాపరుల ఇలాంటి ప్రయత్నాలు ఆ దిశగా ఆహ్వానించవలసినవే.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అద్దె కడుపులూ- అఖండ భారతం

21 శనివారం సెప్టెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

20-9-2013
ఈ మధ్యలో నలుగురితో పంచుకోవలసినవి కొన్ని బాకీ ఉన్నాయి.
1. బొంబే వచ్చేముందే స్వాతిలో ఒక వ్యాసం చదివారు రామలక్ష్మిగారు. ఒకటి భగవతి, అమర్త్యసేన్ ల ఆర్ధిక నమూనాల గురించి. గుజరాత్ ఆర్ధికాభివృద్ధికి భగవతి నమూనాట .. ఏంటంటారూ.. ఇన్ప్రాస్ట్రక్చర్ ఏర్పరచటం. దాన్ని ఉపయోగించుకుని ప్రజలు కొత్త కొత్త సంపాదనా మార్గాలను ఏర్పరచుకోడం… దానివల్ల ఉపాధి అవకాశాలు పెరగటం… అందరూ ఆర్ధికంగా అభివృద్ధి చెందటం. ఇన్ప్రాస్ట్రక్చర్ అంటే ఏంటి.. అని అడిగారు ఆవిడ. రోడ్లు, ఆస్పత్రులు, పరిశ్రమల పార్కులు, టెలికమ్యీనికేషన్ అంటూ తోచిందేదో చెప్పాను. ఆస్పత్రి అనగానే .. ఆవిడ తెగ చదువుతుంది గదా.. మరో వ్యాసం గుర్తొచ్చింది రామలక్ష్మికి. అదీ గుజరాత్ గురించే. అక్కడ అద్దెతల్లుల ఆస్పత్రులు ఉన్నాయిట. అవి పూర్తిగా అద్దెతల్లులను సమకూర్చటం.. వారి గర్భాలలో వేరే ఆడా, మగా విత్తులను నాటటం.. నాటిన నాటినుంచి పంట వచ్చేవరకూ క్షేత్రాలను, వాటి హక్కుదారులైన భర్తలను, లబ్ధిదారులైన ఇతర కుటుంబ సభ్యులనూ సంరక్షించటం.. పంట వచ్చాక ఖర్చులనూ లాభాలనూ లెక్క చూసుకుని ఎవరికి కావలసింది వారి చేతిలో పెట్టి తామూ కొంత చేసుకోటం.. ఇదీ కార్యక్రమంట. ఇంతమందికి.. జీవనోపాధి లభిస్తుంది. మూడు నాలుగు పంటలతో ఒక కుటుంబం కుటుంబం ఆర్ధిక స్థితి మారిపోతుంది. వారి బిడ్డలు కాకపోయినా మనుమలు కడుపులను అద్దెకు తెచ్చుకునే ఉన్నత స్థితికి ఎదగవచ్చు. చిత్రం చాలా పచ్చ పచ్చగా ఉంది. అయితే నా మట్టిబుర్రకి ఓ అనుమానం వచ్చింది. – ఇంత మార్కెట్టుందిటోయ్ – అన్నాను . నా తెలివితక్కువకి రామం గారు పకాలున నవ్వారు. –పెద్ద కబుర్లు చెపుతారు గదా.. ఆమాత్రం తెలియదా.. అన్నారు. బుర్ర గోక్కున్నాను. “అదేంటండీ పిల్లలని కనటానికి టైం లేని సాఫ్టువేరు జంటల సంగతి ఏంటి.. కెరీరులో వెనకబడరు.. ఆడా మగా పోటీలుగా పరుగెట్టవచ్చు. పిల్లలవి వాళ్ల డిఎన్ఏలే. సంపాదించిన ఆస్తులు, పెట్టిన షాపులు చూసుకోటానికి వారసులు శ్రమ లేకుండా కాస్తంత ఖర్చుతో పుట్టుకొస్తారు. శీలం సమస్య లేదు. కామం కోసం కూడా టైం కేటాయించనవసరం లేదు.. సగం మంది పని చెయ్యటం.. సగం మంది కనటం బావుంటుంది గదా” అందావిడ. రేపు దేశమంతా అద్దెతల్లుల ఆస్పత్రులు పెట్టాలని ప్రభుత్వాలు పధకాలు వెయ్యొచ్చు.. మన నియోజకవర్గంలో ప్రతి వీధికీ తెప్పిస్తామని ప్రజాప్రతినిధులు వాగ్దానాల ఖాతాలో చేర్చుకోవచ్చుగదా అని నేను నా ఊహలు కొనసాగించాను. ఇది నలుగురికీ పంచేసుకోవాలని .. మన దేశం గురించి పెసిమిస్టులు ఎవరైనా ఉంటే .. వాళ్లని మార్చెయ్యాలని ఎఫ్బీలోకి దూర్చేసాను.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…
← Older posts

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: