మతాల చరిత్రని రెండుగా విభజించ వచ్చు. తొలి మతాలు మలి మతాలు అని లోగడ నేను విభజించుకున్నాను. మరింత స్పష్టత కోసం వ్యవస్థీకృతమయే పరిణామ దశలోవి తొలి మతాలు అంటున్నాను. వ్యవస్థీకరించటంతోనే ఆరంభమయేవి మలి మతాలు. ఈ తొలి మతాలలో ఉండే సాధారణ లక్షణం అనేక మంది నమ్మకాలనూ, ఆరాధనా పద్దతులనూ, సంస్కృతులనూ కలుపుకోటం. మలిమతాల పుట్టుక తొలిమతాల అవలక్షణాల మీద తిరుగుబాటుతోనే సాధారణంగా జరుగింది. ఒక దేవుడు, లేదా దైవ ప్రతినిధి, అతను చెప్పాడని చెప్పే గ్రంధం, నిజమైన దేవుడనే భావన మలి మతాల వ్యవస్థీకృతతకి సాధారణ చిహ్నాలు. చర్చి వంటివి వాటి వ్యవస్థీకరణని పటిష్టం చెయ్యటానికి పుట్టాయి. ఈనాడు హిందూమతం అనేపేరున స్థిరపడినది తొలిమతాలలో ఒకటి అనవచ్చు. పరిణామం, మార్పు అనేవి ఏ రకమైన మతానికైనా అనివార్యం. మార్పు పట్ల కొంతైనా సుముఖత వీటికి ఉంటుంది. మార్పు పట్ల ఎక్కువ విముఖత మలి మతాల లక్షణం. హిందూమత పరిణామములో భజనకూటముల ప్రాముఖ్యత అనే వ్యాసం1930 జనవరి సమదర్శని లో కట్టమంచివారు ప్రచురించారు. ఈ కోణంలో నేను మరో వ్యాసం చదివిన గుర్తు లేదు. హిందువులలో జాతీయతా భావము ప్రాశ్చాత్యులలో వలె లేదని అందఱుని ఎఱుంగుదురు అంటారు కట్టమంచి వారు. ఇది నాకు నిజమే అనిపిస్తుంది. ఒకే క్రైస్తవంలో అనేక జాతులు ఉండటమనే పరిస్థితి ప్రాశ్చాత్యలది. వారి దృష్టికోణం జాతుల కేంద్రకం. జాతి రాజ్యాలు అక్కడ చాలాకాలంగా ఉన్నాయి. దానివలనే జాతి అనే భావన అక్కడ ప్రముఖపాత్ర వహించింది. మన రాజకీయకూటములు రాజు కేంద్రకాలు కాని భాష వంటి జాతి లక్షణ కేంద్రకాలు కావు. కట్టమంచి వారి పరిశీలనా నైశిత్యం కోసం, మన గురించి మన ఆలోచనలలో ఒక నూతన కోణం కోసం ఈ వ్యాసం చదవాలి.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…