దేవీప్రసాద్ గారు కొంతమందికైనా తెలిసి ఉండాలి. వ్యంగ్య రచనలకి ఆయన పేరు చెపుతారు. వ్యంగ్యానికీ హాస్యానికీ తేడా ఏమిటండీ అని తెలిసినాయన ఒకరిని అడిగితే మందహాసం మందుహాసం అన్నాడు. నాకది ఎలా అర్ధంమయిందంటే చిన్నినవ్వు మనసులో నాటుకుంటుంది దాని జ్ఞాపకం చాలాకాలం మనసులో ఉంటుంది. అది గుర్తైనపుడు మళ్లీ అదేనవ్వు కలిగిస్తుంది. మందుహాసం ఆ సమయంలో పగలబడి నవ్వించి తరవాత మరుపున పడుతుంది. మనకెందుకో మందహాసం తెప్పించేవి తక్కువ మందుహాసం తెప్పించేవి ఎక్కువ పడతాయి అని ఆ తెలిసినాయన చెప్పేవాడు. కితకితలు పెడితే తప్ప నవ్వురాని జాతి అని విసుక్కునీ వాడు. ఆయన ఏ లాబు చరిత్ర చూచినా ఏముంది గర్వకారణం అంటూ పారడీ చెప్పాడు. ఆయన నోట విన్నాను ఈ దేవీప్రసాద్ గారి గురించి. ఆ తెలిసినాయన నేనింకా తెలుసుకోవలసినవీ తేల్చుకోవలసినవీ ఉండగానే జారుకున్నాడు. ఈ దేవీప్రసాద్ గారి కచేరీ కథనం మీకు అందజేస్తున్నాను. ఎవరైనా చూసారనటానికి ఫేబుక్కులో లైకులు ఒక ఆధారంట. ఆ లైకులు తెచ్చుకోటం ఓ కళట. కథానిలయం చేయాలనుకున్న పరిశోధనాపత్రాల సేకరణకి సంబంధించి టపాకి పది ఇష్టాలు దాటటం గగనమై పోయింది. కట్టమంచి వారి వ్యాసం చెప్పిన మనకి జాతి అభిమానం లేదు, కులాభిమానం స్వాభిమానం తప్ప అనే అభిప్రాయాన్ని ఎవరూ చదవనైనా లేదు. ఇదీ నిష్కామకర్మలా చెయాల్సిందే నని ఓ పెద్దాయన చెప్పాడు. సరే కానమ్మని, ఏమవుతుందో చూదామని ఈ కచేరీ కథనం 72 ఏళ్ళ క్రితం ఆంద్రపత్రిక 1950 ఉగాది సంచికలో వచ్చింది. వీధిలో పెడుతున్నాను ఈ లంకెలో ..
మాచిరాజు దేవీప్రసాద్ కచేరీకథనం
16 సోమవారం మే 2022
Posted Uncategorized
in