రాచకొండ విశ్వనాధశాస్త్రి గారు మా తరాన్ని సృష్టించిన మహా రచయిత. ఆయన తెలుగు వాడిగా పుట్టటం ఆయన దురదృష్టమనీ తెలుగు వాడి అదృష్టమనీ మా రోజులలో పెద్దలు చెప్పేవారు. సమకాలీన దృష్టితోనే వారు ఆ మాట అనేవారు. ఆయన వందేళ్ల క్రితం ఈ తారీఖున పుట్టారు. 13వ ఏటనే కలం పట్టారు. ఏ మహా రచయిత అయినా కాలం దాటి కొంత వరకే ముందుకు చూడగలడు. తన కాలపు యువతను ఉత్తేజపరచగలడు. వారికి ఒక ఉమ్మడి సామాజిక స్వప్నాన్ని చూపించగలడు. జాతి వారిని సంపదగా భావిస్తుంది. కాని మన తెలుగు భాష మాటాడేవారు మన దేశంలోని ఇతర భాషా సమాజాలతో పోలిస్తే తమని తాము భాషాపరమైన జాతిగా అంగీకరించరు. ఒక మహా రచయితని అతని కాల పరిస్థితుల దృష్ట్యా అంచనా వేయరు. అతని పుట్టుక జరిగిన ప్రాంతం, కులం, వర్తమాన అక్షరాస్యుల రాగద్వేషాలతోనే తూచుతారు. ఇలాంటి సాహిత్య స్థితిలో శాస్త్రిగారిని తలుచుకునేది కొన్ని గ్రూపులు మాత్రమే. సారాంశాన్ని పక్కన పెట్టి పునర్మూల్యాకనం అనే మంచి పేరుతో పదాలలో రంధ్రాలు వెతికే కాలం ఇది, అటు సాంప్రదాయపరులకీ ఇటు వారి రాజకీయ ప్రత్యర్ధులమని చెప్పుకునీ వారికీ కూడా కమ్యూనిజం అనే నిజం పట్ల ఒక ద్వేషం రాజ్యమేలుతున్న దశలో అందరికీ చెందే శాస్త్రిగారు కొందరికే పరిమితమై పోయేకాలంలో వారి నూరేళ్ల జయంతి సంబరంగా చేసుకోవాలంటే మనసు ఇచ్చగించటం లేదు. కాని నా ఉద్వేగాలు నన్ను నిలవనీయటం లేదు. నా వ్యక్తిగత తృప్తికోసం నేను ఈ కథలు వరసగా నా బ్లాగ్ ద్వారా చదువరులకు అందజేస్తున్నాను. ఈ కథలు నేను కథానిలయం కథా సేకరణలో సేకరించినవి. ఇవి మనసు సంస్థ రచనాసాగరం ప్రచురించేనాటికి సేకరించని కథలు. శాస్త్రిగారి ఆఖరిదశ కథ 28వ ఏట రాసారు. నా దృష్టిలో అది ప్రపంచంలోనే అత్యుత్తమ కథలలో ఒకటి. ఆ దశలోనే రాసిన కథలు ఇవి. వీటిలో రూపొందుతున్న మహారచయిత ఆలోచనలను ఆవేశాలను మనం పట్టుకోగలం. వీలైతే చదవండి. వీటిని ఈ తరం చదివితే మరింత ఆనందం.

https://vivinamurthy.files.wordpress.com/2021/07/1950-06-15-crv3.pdf