మంజీర కలంపేరుతో 1958-59లలో భారతి, ఆంధ్రపత్రికలలో పది కథలు రాసారు ఎమ్జీ రావు అనే ఆయన. వీరి పూర్తిపేరు మంచికంటి గున్నారావు. వీరు మధ్యప్రదేశ్ నైన్పూర్లో రైల్వేలో పనిచేస్తుండే కాలంలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ వీరికి మిత్రుడు. వీరితో మూడవ మిత్రుడు ఆర్.ఎమ్. రావు గారు. మృత్యంజయరావు గారని గుర్తు. పురాణం తమ ముగ్గురి మీద ఒక నవల రాసారు. వీరు అక్కడ నుంచి జ్వాల అనే పేరిట ఓ కథాసంకలనం 1956లో తీసుకువచ్చారు. 1926లో పుట్టిన గున్నారావు గారు రెండురోజుల క్రితం 92వ ఏట మరణించారు. వీరు మా నాన్నగారికి మేనమామ కొడుకు. 1967లో ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు చేరినపుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఉద్యోగం రాలేదు గాని నా జీవితంలోకి కమ్యూనిజం వచ్చింది. 65లో రైల్వే జనరల్ స్ట్రైక్ జరిగినపుడు మంజీర కమ్యటనిస్టుగా ట్రేడ్ యూనియన్ కార్యకలాపంలో జైలులో ఉంచారని గుర్తు. శిక్షగా గార్డు నుంచి క్లర్కుగా డిప్రమోట్ చేసారు. వారి ద్వారానే నాకు కమ్యూనిజంతో పరిచయం జరిగింది. మొదటి సంవత్సరం వరకూ కమ్యూనిజం అనేది ఒక ప్రకృతి విరుద్ధమైన ఆదర్శంగా ఆయనతో వాదించేవాడిని. భావించేవాడిని. అసమానత అనేది ప్రకృతి సహజమైనదనేవాడిని. తరవాత ఆయన కాపిటల్ గురించి చెప్పి చదవమన్నారు. అయిదువేళ్లూ ఒకటి కావనే వాదన ఆరోజులలో చాలామంది వాడేవారు. క్రమంగా నేను నా వ్యక్తిగత జీవితంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం వల్ల కలిగే అవమానాలు అనుభవించుతూ కమ్యూనిజం వైపు ఆకర్షితుడయాను. పునాది -ఉపరితలం అవగాహన నా బౌద్ధిక జీవితానికి ఈనాటి వరకూ ఆలంబనగా ఉంది. దీనికి తొలి గురువు మంజీర గారు. సమాజ పరివర్తనలో లేదా పెనుమార్పులో సాహిత్యం యెక్క పాత్ర పట్ల చిన్నచూపు నా స్వంతమేగాని వీరికి దానిపట్ల కొంత గురి ఉండేది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుకున్న రావు గారు నవల అనేది ఎలా ఉంటుందో చెప్పాలన్న ఆలోచనతో సుమారు 5వేల పేజీల నవల మహాయానం రాసారు. దానిని ముద్రించాలన్న ఆశ తీరలేదు. కథానవీన్ తరవాత మనసు రాయుడు గారి వంటి వారిద్వారా నా సిగ్గుబిడియాలు విడిచి కొంత ప్రయత్నం చేసాను. ఫలించలేదు. ఎవరినీ ఏనాడూ ఏదీ అభ్యర్థించరాదన్న  వెర్రి నియమం నాది. సాహిత్యమే ఒక పనికిమాలిన వ్యవహారం.. దానికోసం ఆత్మాభిమానం చంపుకోవటంగా అనిపించుతుంది. ఈజాడ్యం నాకు చాలా చిన్నితనంలో పట్టింది. దీనివల్లనే నేనూ నా సాహిత్యం కూడా మహాయానంలాగే తొందరగా కాలగర్భంలో కలిసిపోటం తప్పదు.

పోతే రావుగారు నాచేత చాలా పుస్తకాలు చదివించారు. అందులో కురుగంటి సీతారామయ్య గారి నవ్యాంధ్ర సాహితీవీధులు బాగా గుర్తు.(పేర్లు తప్పు కావచ్చు.) డోస్టోవిస్కీ నేరమూ శిక్ష నా జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి పుస్తకం వారే నాకు ఇచ్చారు. సాంప్రదాయం అలవాటు అనేవాటి సంబంధం గురించి వారి వివరణ నా ఆలోచనలలో కలకాలం నిలిచినది. అలాగే ఫలానీది చదవరాదనేది తప్పు. చదివి నీ అభిప్రాయం నువ్వు ఏర్పరచుకోవాలన్నది వారి నుంచే నేను నేర్చాను. కమ్యూనిస్టులు అలాంటి నిషిధ్దాలు చెయ్యటం వారికి నచ్చేది కాదు. ప్రభుత్వం ఆపని చెయ్యరాదనేవారు తాము ఆపని ఎందుకు చేస్తారనేది వారి ఆలోచన. సెక్సుతో సహా ప్రతిదీ చదివి అభిప్రాయం ఏర్పరచుకోవాలనీ పేరుచూసి నిర్ణయించుకోరాదనీ దానిపై అభిప్రాయం చెప్పరాదనీ  నా 19వ ఏట ఆయన చెప్పిన విషయం నాకు ఇప్పటికీ అనుసరణీయమే. ఆ తర్వాత దరిశ చెంచయ్య గారి నేనూ నా దేశం నన్ను పూర్తిగా తీర్చిదిద్దిన పుస్తకం. ఇది మంజీర గారు ఇవ్వలేదనే గుర్తు. వారితో నేను నా ఫార్మేషన్ దశలో తప్ప ఎక్కువగా గడపింది లేదు. విశాలాంధ్ర వారు వందేళ్ల తెలుగుకథలో వారి కథ చేర్చటం నాకు ఆనందం కలిగించింది. అది నా రికమండేషనా అని ఫోన్ చేసారు. మావయ్య గారూ నాకే సంబంధం లేదు అని చెప్పాను. ఒక్క కూతురు లండన్లో ఉంటోంది. చివరిరోజులలో నర్సమ్మూర్తీ ఓమారు రావోయ్ అని ఆరునెలల క్రితం ఫోన్ చేసారు. వెళ్లలేకపోయాను. పనిగట్టుకుని చెయ్యవలసినవెన్నో చేయలేకపోయాను.  హైదరాబాదు వెళ్లినపుడల్లా విద్యానగర్లో వారింటికి వెళ్లేవాడిని. మనసులో సొదంతా ఈ ఫేస్బుక్కు అనే సంతలో ఉంచుతున్నాను. నా ఫీలింగ్స్ కోసం రేపటి నుంచి ఆయన కథలు నా బ్లాగులో ఉంచుతున్నాను. ఈలంకెను పూర్తిగా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి gotoపై క్లిక్ చేయండి.  http://kathanilayam.com/story/19200