ఇటీవల కలిసినపుడు నా వ్యక్తిగతమిత్రులు రజనీకాంత్ గారు వెల్చేరు నారాయణరావు గారి కన్యాశుల్కం నాటకం ఆంగ్లానువాదానికి ముందుమాటపై నేను మిసిమి పత్రికలో రాసిన వ్యాసం ప్రసక్తి వచ్చింది. దానిని తను చూడలేదనీ పంపమనీ వారు అన్నారు. ఇది జరిగి చాలాకాలం అయింది. నిరాసక్తత, వయసుపోరు( మా రాయుడుగారి మాట అంటే ముదిమి లక్షణాలు) వల్ల వారికి పంపలేకపోయాను. ఈరోజు బొంబేలో ఉండి ఏదో రాసుకుంటుంటే అకస్మాత్తుగా గుర్తువచ్చింది. వారికి పంపేటపుడు చాలాకాలమయింది గదా బ్లాగులో పెడితే అనిపించింది. చివరికి మనసు కూడదీసుకుని ఆపని చేస్తున్నాను. రజనీకాంత్ గారితో బాటు ఆసక్తిగలవారందరి కోసం ఈ నా వ్యాసం..
ఒక చిన్ని మనవి. చర్చ సాగించటానికి విషయ పరిజ్ఞానంతో బాటు సహనం, పరస్పర గౌరవం, అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పటం తప్పనిసరిగా ఉండాలి. గెలవాలన్న తొందరలో ఎదుటివారి అభిప్రాయలకు- చర్చాంశానికి బాహిరమైన దోషారోపక కంఠస్వరంతో- జవాబివ్వటం రెచ్చగొట్టటం తప్పనిసరిగా ఉండకూడదు. తెలుగు సమాజం యొక్క పరిస్థితిని ఫేస్బుక్కు వంటి కొందరికే చెందిన సోషల్ మీడియా పూర్తిగా ప్రతిఫలించదనే నేను ఆశపడుతున్నాను. ఈ మీడియా చర్చకి అవసరమైన వాతావరణం కల్పించలేదని గట్టిగా అనిపించింది. మౌఖిక చర్చలో ఆవేశకావేషాలను నియంత్రించుకోటం- లిఖితరూపంలోని చర్చలోకన్న- ఎక్కువ కష్టమనే నా అంచనా ఈ సోషల్ మీడియా చర్చలను చూసాక తప్పని తేలింది. వెల్చేరు వారి ముందుమాటపై నాయీ వ్యాసం నా సాధారణ రాతలకూ అభిప్రాయాలకూ పూర్తిగా భిన్న మైనది. ఆలోచనాదోషాలు చూపే ధోరణికీ నేను ఇతరులకన్న అధికుడననే అహానికీ మధ్య దగ్గర సంబంధం ఉంది. ఎత్తిచూపవలసిన పరిస్థితులు ఉంటాయి. కాని నేను మాత్రం ఆపని ఎన్నడూ స్వీకరించలేదు. ఈ ఒక్క విషయంలో నేను నాకు తప్పదనిపించి ఈ వ్యాసం రాయటం, ప్రచురించటం కూడా చేసాను. ఇది వెల్చేరు వారితో చర్చను ఆశించి ఉద్దేశించి రాయలేదు. ఆ వ్యాసం చదివే పాఠకులకి నా అభిప్రాయం చెప్పే స్వరంతో రాసాను. నా మనవి ఏంటంటే లిఖిత చర్చలలో అది పదిమందిమధ్య జరిగేటపుడు ఆ చర్చలకు సామాజిక సద్వినియోగం ఉండాలంటే స్వయం నియంత్రణ, విషయస్పష్టత కోసం ప్రయత్న ం, మన జవాబు ఎవరికోసం ఉద్దేశించబడిందన్న ఎఱుక ఆ చర్చలో పాల్గొనే వారికి ఉండాలి. లేకపోతే తెచ్చుకోవాలి. సమాజం అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నపుడే చర్చలు కావాలి. యుద్దరంగంలో ఉన్నపుడు చర్యలే కాని చర్చలు ఉండవన్నదీ వాస్తవమే. కాని ఇపుడున్నది యుద్దరంగం కాదు. యుద్దరంగం అన్న ఉద్రేకం కలిగించే బైట పరిస్థితులే ఉన్నాయి. అరిచి, వివాదాస్పద వ్యాఖ్యానాలతో రాత్రికి రాత్రి వీరులయిపోవాలనే లక్ష్యంతో రాసే, మాట్లాడే వారు ప్రముఖంగా కనిపించటం ఉంది. ఆ ధోరణి సరైనది కాదనిపించే వారు పూనుకుని మాటలాడవలసిన సమయం వచ్చింది. కనక సామాజిక బాధ్యత, సత్యపట్ల గౌరవం అనేవి మాటలాడేవారికి ఉన్నపుడే ప్రయోజనకరమైన చర్చలు జరుగుతాయి. ఈ మనవిలో నా మాటలను నేను ఈ వ్యాసంలో ఎంతవరకూ పాటించానన్నది పాటించగలిగానన్నదీ విజ్ఞులు గమనించగలరు.