శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రబుద్ధాంధ్ర పత్రిక నడిపారని చాలా మందికి తెలుసు. ఆ పత్రిక 1934 జూన్ సంచికలో వచ్చిన ఈ రచనని ఈరోజు టపాలో అందిస్తున్నాను. రచయిత భువనగిరి లక్ష్మీకాంతమ్మ గారు. 71 సంవత్సరాల నాటి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా పల్లెటూళ్లలో మార్పు వచ్చింది. ఈమార్పు ఆశించినంత వచ్చిందా అన్నది వేరే చర్చ. పట్నాలలో కొత్తతరహా ప్రచ్ఛన్న అస్పృశ్యత ఫలితాలు నేడు మనం అనుభవిస్తున్నాం. దీనికి మన కుల నాయకుల రాజకీయాలెంత కారణమో, మన రాజకీయనాయకుల కుల సమీకరణాలు ఎంత కారణమో తేల్చుకోవలసిన బాధ్యత ఈ తరంమీద ఉంది. సాంఘిక సంస్కారావశ్యకతని పూర్తిగా వదిలేసి, భౌతికాభివృద్ది ఆశలను కేంద్రం చేసుకున్న రాజకీయవ్యాపారుల దండోరాలో మన జాతి నాయకుల లేమితో మనం ఇలావున్నాం. కొంతైనా బాధ్యత వహించవలసిన సాహిత్యం కొత్త వస్తువులకోసం కృత్రిమంగా పుట్టించబడిన పోటీలో వ్యక్తి సంస్కారం కోసం అలమటించటం మానేసింది. కృతక స్పందనలతో, పరుషపదాలతో, ఆక్షేపణలతో ఎదిరిని రెచ్చగొట్టే సాహిత్యం వ్యక్తి సంస్కారానికి, వివేచనకీ దోహదం చెయ్యలేదు. 71 ఏళ్ల నాటి ఈ రచన చదివినపుడు మన సమాజం, సాహిత్యం రావలసిన మార్పులను త్వరితం చెయ్యటానికి బదులు తప్పుదోవ పట్టించాయని లేదా పట్టించుకోటం లేదనీ అనిపించింది. లేకపోతే రోహిత్ వేముల హత్య- ప్రతి ఆత్మహత్య వెనకా కనీకనిపించని సామాజిక కారణం ఉంటుందన్నది వాస్తవం- జరిగేదా? ఈ లంకెలో ఈ రచన తీసుకోండి. PRABUDDHA_ANDHRA_1934_06_అస్పృశ్యత