ట్యాగులు

30 6 15

రెండునెలలకు పైగా వ్యక్తిగత చికాకులు. నా ఆప్త స్నేహితులు కాళీపట్నం రామారావు గారు – మూర్తీ ఇబ్బందులు వేరు. కష్టాలు వేరు. పూడ్చుకోలేని నష్టమే కష్టం అంటారాయన. మిగిలినవన్నీ ఇబ్బందులు మాత్రమే – అంటుంటారు. అది అక్షరసత్యం అనిపిస్తుంది. ఈ స్థితిలో మనసు మళ్లించుకోటానికి మార్క్సు కాపిటల్ చదవటం ఆరంభించాను. చాలాకాలంగా వాయిదా వేసుకుంటున్న పని. మరో పని పాతపత్రికలలోంచి వ్యాసాలు తీసి బ్లాగులో అందించటం. కథానిలయం పనిలో డేటాబేస్ పని పక్కన పెట్టాను. 87వేల కథలు ఇండెక్సు చేసాను. వాటిని మా రమణమూర్తి గారి ఆధ్వర్యంలో పిడిఎఫ్ లుగా మార్చి కథానిలయం సైట్ లో ఉంచే పని జరుగుతోంది. ఇండెక్సు చేసే రోజులలో ఆసక్తికరమైన వాటిని ఓ సంచీలో వేసాను. వాటినే అందిస్తున్నాను. హఠాత్తుగా 3,4 రోజుల క్రితం ఫేస్బుక్ లో స్నేహితుల అభ్యర్ధనలను పోగేసి ఉంచిన సంగతి గుర్తు వచ్చింది.

వీటినన్నింటినీ పూర్తి చేయాలని పట్టుదల వచ్చింది. కూర్చున్నాను. ఈ అనుభవంతో నా ఆలోచనలు పంచుకోవాలని నా ఈ ప్రయత్నం.

ఆదమీ హుఁ ఆదమీ సే ప్యార్ కరతా హుఁ

బస్ వొహీ అపరాధ్ హర్ బార్ కరతా హుఁ

స్నేహం విషయంలో నాకు ఊహ తెలిసినదగ్గరనుంచీ నేను మనసుకి పట్టించుకున్న భావన ఈ పాటలో ఉంది. సమాజం యొక్క అభివృద్ది సామ్యవాద సమాజంలోనే ఉందని నేను స్థిరపరచుకున్న ఎడమ ఆలోచన. కాని కుడి వారైన ఆరెస్సెస్ వారితో సహా అందరితోనూ నేను స్నేహంగానే ఉంటాను. కుడి భావనల పుట్టుక కూడా మానవ సమాజంలోని సాంఘిక పరిస్థితుల నుంచే జరిగింది. ఈ భావనలు ఈ నేలవని, మార్క్సిజం పరాయి నేలదని కొందరు అంటే నేను నవ్వుకుంటాను.  అలాగే వారిని చదవటానికీ అర్ధం చేసుకోటానికీ నాకు అభ్యంతరం లేదు. ఏదీ నిషిద్ధం కాదు. అయితే ప్రియారిటీస్ ఉంటాయి. ఈ స్థితిలోని నేను స్నేహం విషయంలో నాఅంత నేను ఎవరినీ వదులుకోలేదు. కలవారనీ, ఇన్ఫ్లూయెన్స్ కలవారనీ నేనెవరికీ చేరువా కాను ప్రాధాన్యతా ఇవ్వను అలాగే వారినీ ఎడమూ పెట్టను.

ఇలా నేను స్నేహం విషయంలో అనుసరించినవన్నీ ఫేస్బుక్ స్నేహాల విషయంలో అనుసరించవచ్చా అన్నది ఒక అనుమానం. దానికి కారణం నా హాట్ మైల్ అకౌంట్ దొంగిలించబడటం. జిమైల్ అకౌంట్ అవకుండా జిమైల్ వాళ్లు రక్షించారు. ఆ అనుభవంతో ఉన్న నేను ఈ మాధ్యమంలో అడుగు పెట్టాక ఇన్ని అభ్యర్ధనలు చూసి ఏం చెయ్యాలో అర్ధం కాక తికమక అయ్యాను. మా అమరేంద్ర వాస్తవ స్నేహ ప్రపంచం చాలా పెద్దది. ఆ పెద్దమనిషి సాయంతో ఆయనకి తెలిసిన వారిని అంగీకరించాను ఓ మారు. నాకు ఏమాత్రం వినికిడి ఉన్నా అంగీకరించాను. కాని మనసు మూలుగుతూనే ఉంది. వాస్తవ స్నేహం విషయంలో ఎలాంటి నిబంధనలూ లేని నేను ఈ మాధ్యమ స్నేహం విషయంలో తప్పు చేస్తున్నానని.. అసలు హేకింగ్ భయం కాక వేరే సమస్యలున్నాయా..

ఎలా తేల్చుకోటం..

అందుకోసం 213 అభ్యర్ధనలను ఒకేమారు పరిశీలించే పనిలో పడ్డాను.

ప్రతి ఒక్క ప్రొపైల్ చూడటం చాలా శ్రమ. చాలావరకు చూసాను. నేను సాహిత్య సమూహం వాడిని కనక ఎక్కువమంది వారే అయుండాలనుకున్నాను. బంధువులు, నేను తెలిసిన మిత్రులు ఉంటారనుకున్నాను. కవిత్వం, కవిత్వం కొటేషన్లు, షేర్ చేసుకున్నవి ఆధారంగా సాహిత్య సామాజికులని గుర్తుపట్టాను. రకరకాల మనుషుల మధ్య తిరుగుతున్న ఫీలింగు. పోగా కొంతమందిని వారి చదువు, వృత్తిని బట్టి – సరే – చేసాను. అనేకమంది దేవుళ్ల బొమ్మలు పెట్టేవారు, భక్తి, వైరాగ్య శ్లోకాలు పెట్టేవారు ఉన్నారు. వ్యక్తిగతంగా దైవ విశ్వాసం, భక్తి వంటివి సహజం. వారిలో చాలామంది తమ భక్తిని చాటుకోవాలని చూస్తారు. కాకపోతే దైవం, మతం, జాతి, దేశం వంటి వాటిని కలగాపులగం చేసి ఆ భావాలను ఉగ్రంగా ప్రదర్శించే స్వభావం కొందరిలో కనిపిస్తుంది. మరీ అతిగా నాకు అనిపించిన వారు కొందరిని పక్కన పెట్టాను. మారుపేర్లతో ఉండేవారిని మొదట్లో ముట్టుకోలేదు. కొందరు సంస్థల పేర్లతో కనిపించారు. వారిలో  కొన్ని సరే చేసాను.

కొందరు సెక్సు బొమ్మలతో ఉంటే ఆ అభ్యర్ధనలను తిరస్కరించటమే కాకుండా స్పామ్ గా మార్క్ చేసాను.

అంతా అయాక-

192 సరే చేసాను. ఆ తర్వాత నా అనుభవం క్రింద ఇస్తున్నాను.

మెసెంజరులో కొంతమంది మెసేజ్ పెట్టటం జరిగింది. ఓపికగా జవాబు ఇచ్చినా ఏం కావాలో చెప్పకుండా విసుగించే వారు కొందరు. అలా అంగీకరించిన వారిలో ఒకాయన కుమార్ కరియా పేరుతో మెసేజ్ ఆరంభించారు. ఆయన బొంబైలో లెక్చరర్ గా పని చేసినట్టూ, కన్నూరులో ఉంటున్నట్టు ప్రొఫైల్ లో ఉంది. మా సంభాషణ క్రింద ఇస్తున్నాను.

Hello

Namste

how are you dear

Kaise ho

Not saying some thing !

Will u say something

Tuesday 11:13am

Good morning

21 hours ago

Murthy speak to me or else unfriend me

who r you what you want

My dear what u mean by asking so ? On F B guys who have over 5000 friends in their list , whom all know each other out side the F B ?

need not know but you should tell what you want

you

means

want you thats all

i do’t understand

Dear need you if u r over 60 yrs ?

what you need

you , wiill you give \

what

I love hot men over 60 yrs

Chat Conversation End

నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అన్ ఫ్రెండ్ చేసాను కాని ఇలాంటి అనుభవం ఇంకెవరికీ కలగలేదా ఇలాంటివి మామూలేనా..

చివరగా-

ఈ సామాజిక మాధ్యమం చాలా వేగంగా విస్తరించింది. దీనిని ఉపయోగించుకునే వారి  గురించి ఒక రిసెర్చ్ లో చెప్పిన విషయం ఏంటంటే ఎక్కువమందిలో ఆత్మన్యూనత కనిపిస్తుంది. ఇతర వార్తల ద్వారా దీని మాతృక అయిన ఇంటర్నెట్టులో పెర్వర్షన్స్ గురించి వింటూనే ఉన్నాం. నిజానికి ఇది చాలా శక్తివంతమైన మాధ్యమం. వార్తాపత్రికలు ఆరంభమైన దాదాపు రెండువందల ఏళ్లకి గానీ రేడియో రాలేదు. తర్వాత టీవీ వచ్చింది. ఈ మాధ్యమాలలో జనం పాల్గొనే అవకాశాలతో పోలిస్తే ఇంటర్నెట్టు, ఫేస్బుక్ ఆ అవకాశాలు చాలా పెంచింది. ఇది సామాజిక పరిణామంలో ఎంతవరకూ ఏ రకమైన క్రియాశీల పాత్ర వహిస్తుందో నాకు స్పష్టత లేదు. కాని క్రమంగా రాజ్యం స్వభావ నిర్ణయంలో ప్రజల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. అదే సమయంలో దీని విపరీత లక్షణాలు చూస్తే భవిష్యత్తుపై భయం కూడా కలుగుతోంది.