ట్యాగులు

,

నాకు బాగా పరిచయమైన మొదటి సాహిత్యవేత్త పురిపండా అప్పలస్వామి గారు. నా వెనకబెంచీ మనస్తత్వం వల్ల ఎవరితోనూ చొరవగా పరిచయం చేసుకునే అలవాటు లేధు. ఎవరికి ఏం అవసరం వచ్చినా నేను చెయ్యగలిగింది చేసే గుణం వల్ల ఆయనకి చేరువయాను. తూమాటి దోణప్ప గారి హరికథా సర్వస్వము(అని గుర్తు) వ్రాతప్రతి చదివి వినిపించటానికి ప్రతిరోజూ పురిపండా ఇంటికి వెళ్లేవాడిని. ఆయన నాగురించి అడిగినపుడు నా పద్యకవిత్వం, నా కావ్యం కపోతసందేశం వారికి చూపించాను. వస్తువు అభ్యుదయానికి చెందినపుడు దానికి పద్యకవిత్వం నప్పదని ఆయన చెప్పారు. వస్తువుకి తగిన వాహనం ఉండాలన్నారు. వారి హిందీ అనువాదం ఏదో రామలక్ష్మి గారికి కానుకగా ఇచ్చిన గుర్తు.

మా కారాయజ్ఞం ప్రచరించిన తొలి పుస్తకం కథానికారచన. దీనిని రాసినవారు మహమ్మద్ ఖాసింఖాన్. వీరి వ్యాసాలు కొన్ని ఈ ప్రచురణానంతరం నాకు ఎదురయాయి. వీరి ఫొటో కోసం ప్రయత్నించినా లభించలేదు. వీరు రాసిన వ్యాసం కవితావిమర్శనము 1930 సమదర్శని ఉగాది సంచికలో వచ్చింది. దీనిలో తెలుగు కవిత్వ స్వర్ణయుగం ఇంకా ఆరంభం కాలేదంటారు ఖాసింఖాన్. అప్పటికి శ్రీశ్రీ మహాప్రస్థానం కవిత్వం రాలేదు. భావకవిత్వంతో కొంచెం స్వర్ణయుగద్వారాలు తెరవబడినట్లు ఖాన్ రాస్తారు. కవి వ్యక్తిత్వం, కవిత్వంగా విభజించి ఆనాటి కవిత్వ స్థితిని మొత్తంగా చూడటానికి చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది.

తెలుగు ఆధునిక కవిత్వం తీరుతెన్నుల గురించి అంతగా తెలియని నేను అనరాదేమో గాని నాకు తెలిసి శ్రీశ్రీ మహాప్రస్థానం, శైశవగీతి, కవితాఓకవితా, నగ్నముని కొయ్యగుర్రం తప్ప గొప్ప దీర్ఘకావ్యాలు మనకు తక్కువ.

దీర్ఘకావ్యములు రచింపకుండుట కవికొక లోపము. స్వీయప్రవృత్తిని చిత్రించుట కన్న సామాన్యమానవప్రవృత్తి చిత్రించుటయందే కవి తన కవితాశక్తులను చూపఁగలడు.

ఈ ఖాసింఖాన్  గారి అభిప్రాయం గురించి కవులు ఆలోచించవలసిందిగా వినతి.

ఇందులో పురిపండావారి గురించి చిట్టచివరి పేరాలో రాసిన వాక్యాలు నాకు తెలిసిన స్వచ్ఛమైన పురిపండా వ్యక్తిత్వం గుర్తుచేసింది. కవులూ, విమర్శకులూ తప్పక చదవాల్సిన అంశాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. చదువుతారన్న ఆశతో ఈ వ్యాసం.. SAMADARSHINI_1930_01_01_Volume_No_Issue_No_3