మా ఉదయపు నడక- శేషప్రశ్న

రామలక్ష్మి గారు నన్ను ఉదయమే నడకకి తీసుకుపోతారని మా మిత్రబృందం 20 ఏళ్లుగా నమ్ముతోంది. నేను వారి నమ్మకాన్ని ఖండించను. ఆమాటకి వస్తే నమ్మకాల స్థాయిలో ఉన్నవాటిని ఖండించకపోటమే మంచిది. అలా తీసుకుపోయిన రామలక్ష్మిగారు ప్రశ్నలు వేస్తారు. నేను జవాబులనుకునేవి చెప్పటానికి ప్రయత్నిస్తాను.అపుడపుడు నా మెదడులో ఉన్నది కూడా పంచుకుంటాను. మొత్తంమీద మా మాటలలో సాంసారిక, వ్యక్తిగత అంశాలు 5 శాతం మించవు.  సాహిత్యం, సామాజికం నా మటుకు వేరు కావు. పోతే కల్పనా సాహిత్యం మీద ఆధారపడి మాటలాడుకుంటే దానిని సాహిత్యంగా గుర్తిస్తాం. ఇతర పుస్తకాల గురించి మాటాడుకుంటున్నపుడు దానిని సామాజిక అంశం అంటాం. ఇలా మేం మాటలాడుకునే వాటిలో కొన్నింటిని అపుడపుడు నలుగురితో పంచుకోవాలనిపిస్తుంది. కొద్దిరోజులుగా మా నడక కబుర్లకి ఇరుసు శరత్. ఓరోజు ప్రసాద్ గృహదహనం గురించి ఎత్తటంతో శరత్ పునఃప్రవేశం జరిగింది. మాతరం మా ముందు తరం శరత్ చదవటంతోనే ప్రపంచం గురించి ఆలోచనలలో పడ్డాం. తెలిసీ తెలియనిదశలో శరత్ తెలుగు వాడే అనుకునేవాళ్లం. నేనూ, నామిత్రుడూ బాల్య చేష్టలరాతలలో కలిసి రాసిన నవలల్లో పాదధూళి దిట్టంగానే ఉండేది. ఏభై ఏళ్ల క్రితం చదివిన శరత్ శేషప్రశ్న కమల నా మెదడు మీద శాశ్వతంగా ఉండిపోయింది. కాకపోతే డోస్టోవిస్కీ నేరమూ శిక్షా నన్ను ప్రభావితం చేసిన లేక మార్చిన లేక దిద్దిన పుస్తకం. ఆ రెంటికీ మధ్య నేను చదవటంలో నాలుగైదు ఏళ్ల ఎడం ఉంది. శేషప్రశ్న, భారతి, శ్రీకాంత్ నేను బాగా ఇష్టపడే శరత్ రచనలని చెపుతుంటాను. గృహదహనంతో ఆరంభమైన రామం పఠనం కారామాస్టారి మీదకి పాకింది. ఆయనకి పుస్తక పఠనం ఏమిటో చెప్పాలంటే అదో పేద్ద కథ. దడదడా ఆయన రోజుకో నాలుగు నవలల చొప్పున అక్షరం పొల్లుపోకుండా చదివేస్తూ విప్రదాసులో ఉండగా మేం ఆయననీ, శ్రీకాకుళాన్నీ వదిలి బెంగళూరు వచ్చిసాం. మరో మూడునెలలు ఇక్కడే. రామం గృహదహనం నాకు అంటుకుంది. ఓ పక్క వెబర్, మరోపక్క నున్నా నరేష్ దిద్దూబాట్లూ, తెరానామ్ సహారా ఇంకోపక్క కథానిలయం, వేరేపక్క తెలుగు పుస్తక ప్రచురణ రంగం(జయంతి) ఇలా దశకంఠుడిలా నేను. చివరికి నా దహనం పూర్తయింది. కూతురి పెళ్లి చేసుకుంటున్న ప్రసాద్ ని పట్టుకొచ్చి గృహదహనం గురించి ఆయనేంటనుకుంటున్నారో చెప్పమని పట్టాం. ఈ స్థితిలో శేషప్రశ్న మింగేసింది రామంగారు. దాని గురించి నాచేత మాటాడించాలని ఆవిడ పట్టు. ఆరంభించాను. ఒకటే చదవటం అన్న మంచిబుద్ధి లేదాయె. కాని ఈ రోజు నడకలో నేను ఏకబిగిన చదివానని గుర్తు చేసి ఇప్పుడుచెప్పమంది రామంగారు.  చేప్పాలనే ఉంది. అది ఎంతసేపు అఁటిపెట్టుకునుంటుంది.. చూదాం.. రేపు దానిగురించి బుద్ది సహకరిస్తే..