ట్యాగులు

16 December 2014

ఈ రోజు అందిస్తున్న వ్యాసం కాత్యాయనీ విద్మహే గారిది. వారి గురించి తెలియని వారుండరు. ఈ వ్యాసం అందించేముందు కొన్ని విషయాలు చెప్పాలి.

1.నవతీతరణం అనే పేరిట  కాళీపట్నం రామారావు గారికి 90 ఏళ్లు దాటటం సందర్భంగా ఈ వేడుక తలపెట్టినపుడు నా స్థితి మొదటివిషయం.  ఇలాంటి వాటి పట్ల నాకు ఆసక్తి లేదు.  నేను పూనుకోను. ఎవరైనా పూనుకుంటే దానిని తప్పుపట్టను. నేనేదైనా చేయగలిగితే చేయటానికి సాధారణంగా నాకు అభ్యంతరం ఉండదు. ఈ వేడుక సంచిక తీసుకువచ్చే బాధ్యత అంగీకరించాక నాకు కలిగిన ప్రశ్న.. కారా సాహిత్యానికి వర్తమాన ఆవశ్యకత ఉందా? సాహిత్యానికి ప్రయోజనం ఉందనుకునేవారు అందరూ ఒకరు కారు. కిన్నెర శ్రీదేవి వాదన(త్వరలో అందిస్తాను) ఓ ఆలోచనా బడి. ఆ ప్రయోజనం ఎంతకాలం అన్న విషయంలో నేను కొడవటిగంటి వారి అభిప్రాయన్ని అంగీకరిస్తాను. ఏ గొప్ప  రచన అయినా అది ఆ కాలం ఆవశ్యకత నుంచి పుట్టి ఆ ఆవశ్యకత సమాజంలో ఉన్నంతకాలం ఉండి తర్వాత పనికిరాకుండా పోతుంది. ఇదీ వారి అభిప్రాయం. కాకపోతే అన్ని కాలాలకీ (సార్వకాలీనత). అన్ని సమాజాలకీ( సార్వజనీనత) వర్తించే ప్రయోజనాత్మక సాహిత్యం ఒకటి ఉంటుందని కొందరు భావిస్తారు. వారి వాదనకి అనుకూలంగా రామాయణ, భారతాలూ ఇటీవలి కాలపు కన్యాశుల్కం వగైరాల ఉదాహరణలు కనిపిస్తాయి. ప్రయోజనవాదుల గుంపులో ఇవి రెండు కొసలు. నా అభిప్రాయం మేరకు కారా యజ్ఞం రాసిన నాటి పరిస్థితులకీ నేటికీ మార్పులు ఉన్నాయి. కాకపోతే సమాజంలో ఏ మార్పులు ఆశించి సాహిత్యం వెలువడాలని భావించారో ఆ మార్పులు రాకపోగా.. ఆ మార్పుల గురించి మాటలాడటమే వెనుకబాటుతనంగా భావింపజేసే స్థితి నాకంటికి కనిపిస్తోంది. ఈ దృష్టితో కారా రచనల ఆవశ్యకత గురించి ఇటువంటి సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొనే వారి లేదా యువకుల ఆలోచన తెలుసుకోవాలనిపించింది. పుడూరి రాజిరెడ్డి, వేంపల్లె షరీఫ్ లతో మాటలాడి మీ అభిప్రాయం చెప్పమని అడిగాను. ఇందులో భలవంతంగాని, మొహమాటం గాని వద్దని మీరు రాయకపోయినా దానిని నేను అర్ధం చేసుకోగలననీ చెప్పాను.  ఈమాట నా ఆత్మీయులతో కూడా అన్నాను.  వారు వారిలో సంప్రదించుకుని బత్తుల రమాసుందరి గారి పూనికతో సారంగ అంతర్జాల పత్రిక సహకారంతో కారా కథలను చర్చించారు. వాటిని శ్రద్ధగా చదివి నేను ఒక అభిప్రాయానికి రావలసి ఉంది. అనేక పనుల(సాహిత్య సంబంధితమైనవే) మధ్య నాకు తగిన తీరిక ఇంతవరకూ లభించలేదు. మా తరపు ఆలోచనా బడికి చెంది విమర్శా రంగంలో చాలా కృషి చేస్తున్న విద్మహే గారిని కారా సాహిత్యం నుంచి ఈ తరం నేర్చుకోవలసింది ఉందా ఉంటే ఏమిటది అన్న దృష్టికోణంతో  రాయమని కోరాను. నా కోరిక మన్నించి ఆవిడ పరిశీలించి రాసిన వ్యాసం ఇది. ఈతరం చదివి చర్చించవలసిన వ్యాసం ఇది. ఫేస్బుక్ లో జరిగే సాహితీ సంబంధిత చర్చలూ, కృషీ వీలైనంతగా గమనిస్తుంటాను. వీటిపై నాకు అసంతృప్తిలేకపోయినా పూర్తి సంతృప్తి లేదు. కాని, సామాజిక అభిప్రాయాలు మలచటంలో భవిష్యత్తు దీనిదే అని నేను భావిస్తున్నాను. బహుశా ఇది ఆరంభదశ కావచ్చు. తొలి అడుగులు తడబాటులూ తప్పవు. వీటి నిర్వాహకులు వీటి పరిమితులను అర్ధం చేసుకుంటూ ముందుకు సాగుతారని నేను అనుకుంటున్నాను.

  1. కాత్యాయనీ విద్మహే గారి ఈ వ్యాసం మన వర్తమాన సాహత్య సమాజం స్థితిగతులలో ఒక స్వీయపరిశీలనతో కూడిన చర్చకి దారితీస్తే నాయీ శ్రమకి వారి శ్రమకి కొంత వినియోగం జరుగుతుంది.
  2. ఈ నా ప్రయత్నం కారా సాహిత్యానికి ప్రచారం కాదు. ఎందుకంటే నేడు కల్పనా సాహిత్యపు సంతలో అమ్మకపు విలువ అంతా మన వెనకటి తరం కారా వంటి రచయితలదే. తెలుగు, బహుశా ప్రాంతీయ భాషా సాహిత్యాలలో గత మాధుర్యంకి గల మార్కెట్ ముందు వర్తమాన రచయితల అద్భుత కథన కౌశల్యాలకి లేకపోవటం, వాటంత అవే అమ్ముడుపోక పోటం జరుగుతోంది. ఈనా పరిశీలన తప్పవలాని నేను సామాజిక మెరుగుదల దృష్ట్యా కోరుకుంటున్నాను. నిజమే అయితే మారాలని వాంఛిస్తున్నాను.

వెలగా వెంకటప్పయ్య గారితో ఆరంభమైన ఈ వ్యాసాలు వీలైనంత నేటితరం పట్టించుకుంటే .. సంతోషం.kara-90 – 21