ట్యాగులు

మనిషి భయం నుంచే దైవం అనే భావన పుట్టింది. మానవజాతి తొలినాళ్లలో భౌతికమైనవే దైవాలు. తనకి అపకారం కలిగించరాదనే భావనే తొలి దైవపూజ. తనకి ఉపకారం కలిగించమనే భావన ఆ తర్వాత వచ్చినదయుండాలి. గుంపులు ఏకం కావలసిన పరిస్థితులలో.. ప్రతి గుంపూ తమకి ఏర్పరచుకున్న దైవాలను ఏకం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. దానినుంచే దేవుళ్లకి దేవుడు లేక అధికారి వంటి భావనలతో(ఇంద్రుడు వంటివి) తొలిమతాలు ఏర్పడ్డాయి. ఇవి నైరూప్య భావనలు(abstract ideas). మానవజాతి ప్రస్థానంలో, ప్రపంచ పరిణామంలో ఈ మతాల పాత్రని పూర్తిగా వ్యతిరేకదృష్టితో చూడటం సాధ్యంకాదు. ఈ తొలిమతాలను ఏర్పడినవి లేదా పరిణమించినవి అనొచ్చు. అవి సమాజ పరిణామంలో సంపన్న లేదా పాలక వర్గాల అవసరాలు తీర్చటానికీ, వారికి అసాధారణ హక్కులను ఇవ్వటానికీ ( రాజే దేముడు) శ్రమపడే వారిని పాలకులకి విధేయులుగా చేయటానికీ పరిమితమై పోయిన దశలో పుట్టినవి మలిమతాలు. (క్రైస్తవం, బౌద్ధం, జైనం, మహమ్మదీయం, కన్ఫ్యూషియనిజమ్, జురాష్ట్రియిజమ్ వంటివి). ఇవి తొలిదశలో.. తొలిమతాలపై ప్రజల తిరుగుబాటు అవసరంతోనే.. ఏర్పరచినవి లేదా స్థాపింపబడినవి. వీటికి సామాన్యజనంలో కల అసాధారణమైన ఫాలోయింగు(ఆదరణ)తో పాలకులు వాటిని స్వీకరించటం గమనించవచ్చు. మతవ్యాప్తి అనే భావన వీరి చర్యల ఫలితమే. మతవ్యాప్తి అన్నపేరిట అధికారవ్యాప్తి దానితో బాటు ఇతర ప్రదేశాలలోని సంపదను కొల్లగొట్టటానికి శక్తీ సమకూరాయి. వ్యాప్తి వెనుకనే మతరక్షణ అన్న భావన పుట్టింది. అది కొల్లగొట్టబడుతున్న ప్రదేశాలను ఏకం చెయ్యటానికి వినియోగపడింది. ఇదంతా మానవజాతి చరిత్ర. మతవ్యాప్తి వెనక ఇలాంటి కారణాలున్నా దానివల్ల జరిగిన అనేక వాంఛనీయ పరిణామాల పట్ల గుడ్డితనం కూడదు. మానవ జ్ఞానవ్యాప్తీ, జడప్రాయమూ మృతప్రాయమూ అయిన సమాజాలలో కదలికా.. వేరే సంస్కృతులతో పోల్చుకునే అవకాశమూ, బలంగా పాతుకుపోయిన సాంప్రదాయక అధికార కేంద్రాల నుంచి వ్యక్తులకి నూతన అధికారా కేంద్రాల రక్షణా వంటివి వాంఛనీయపరిణామాలే గదా.. ఈ నా అవగాహనతో వందేళ్ల క్రితం మన సమాజంలో జరిగిన పరిణామాలను చూస్తే చాలా ఆసక్తికరమైన, చర్చనీయమైన అంశాలు ఈ వ్యాసంలో కనిపించాయి. ముందుకెళ్లే మనిషైనా, సమాజమైనా రాగద్వేష రహితంగా చారిత్రకదృష్టితో గతాన్ని పరిశీలించటం జరుగుతుంది. ఈ వ్యాసం అందించటంలో నా ఉద్దేశ్యం అదే. దీనిని మతదృష్టితో కాక శాస్త్రీయదృష్టితో చదవాలని నా మనవి.

ఆంధ్రపత్రిక ఉగాది సంచికలలో 1910 మొదటిది. దానిలో ఉన్న ఈ వ్యాసంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. AndhraPatrika ugadi 1910 mishanaries