17-12-2013

భోజనాలు ముగిసాయి. గుంపులు గుంపుల కబుర్లు ముగిసాయి.
తిరిగి రాయుడు మరో ప్రశ్న లేవనెత్తారు. దానిపై వివరంగా మాటలాడారు.
కమ్యూనిస్టు అనుభవాలతో కేపిటలిజం చాలా నేర్చుకుంది. బలపడింది. 1972లో శామ్యూల్ పి. హంటింగ్ టన్ రాసిన political order in changing societies గురించి వివరించారు. 1965-66 నాటి పి.ఎల్.480 పధకం గురించి చెప్పారు. అభివృద్ధిని మదింపు చేయటంలో పరిమాణాత్మకంగా(qualititative) లెక్కగట్టటం ఆరంభించిన బాడెల్ పద్దతిని వివరించారు. ఆయుఃప్రమాణం, అక్షరాస్యత వంటి కొలబద్దలు వివరించారు. Agriculture, an unfinished business పేరిట నెహ్రూ పాలనలో ప్రపంచబాంకు ప్రతినిధి లెడ్లాన్సికీ రాసిన రిపోర్టుల గ్రంధాన్ని ప్రస్తావించారు. కమ్యూనిస్టులు ఎందుకు కేపిటలిస్టుల నుంచి నేర్చుకోలేకపోయారన్నది ఆయన ప్రశ్న.
దానికి ఉన్న ప్రతిబంధకాల గురించి కొంతమంది తమ ఆలోచనలు చెప్పారు. కమ్యూనిస్టులు రాజ్యం ఏర్పరిచిననాడు వారు ఇంటా బయటా ఎదుర్కొన్న సమస్యలూ, స్థిరపడటానికి చేసిన ప్రయత్నాలూ ప్రస్తావించారు. అధ్యయనంలో కేపిటలిస్టులకున్న అవకాశాలు రహస్య ఉద్యమాల వారికి లేకపోటం ఒక అభిప్రాయం.
అంజిరెడ్డి వివరంగా మాటలాడి అనేక విషయాలు చెప్పారు.
అద్యయనంలో వెనకబడిన మాట నిజమే. విలువల స్థాపన కోసం సమాజాల ప్రయత్నం 20వ శతాబ్ధంలో మొదలయింది.
అందులో 3 ప్రధాన ఘటనలు.
1919- సోషలిస్టు రాజ్యం స్థాపన
1930- ఆర్ధిక మాంద్యం
1991- సోషలిస్టు పతనం
1919లో పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రత్యామ్నాయం ఉందని స్పష్టమయింది.
1930 ఉత్పత్తికి తగిన గిరాకీ ఉంటుందని అప్పటి వరకూ ఆర్ధిక శాస్త్రం భావించింది. మాంద్యం వచ్చింది. కీయిన్స్ పరిష్కారం ఆర్ధిక వ్యవహారాలలో రాజ్యం జోక్యం. రాజ్యం గిరాకీ సృష్టించాలి. కరెన్సీ సృష్టించాలి. ఐరోపా దేశాలలో –శ్రేయోరాజ్య భావన- కీయిన్స్ భావాల ఫలితమే. కినీషియన్ డిమాండ్ మానేజ్మెంటు వల్ల శ్రేయోరాజ్యాలు సామ్యవాదం వైపు వెళ్లొచ్చన్న భయం క్రమంగా ఏర్పడింది. 1970ల వరకు వారు చేసిన వ్యవస్థాగత పరివర్తనం ప్రశంసించక తప్పదు. లాభాలలో కొంత భాగం తగ్గింది. ఆర్ధికాభివృద్ధిలో stagnation వచ్చింది. ధరలు పెరిగాయి. కినీషియన్ విధానాల వల్ల stagflation (high inflation and low growth) ఏర్పడింది అన్నాడు నోబుల్ లారెట్ మిల్టన్ ప్రెడ్ మాన్. -శేయోరాజ్యం సరికాదు. అది సామ్యవాదానికి సూచన. నైతికంగా అది పెట్టబడిదారీకి నప్పదు. ధరల నియంత్రణ వంటి రాజ్యం జోక్యాలు స్టాగ్నేషన్ కి కారణం. వ్యక్తుల నిర్ణయాలు హేతుబద్ధం కావచ్చు. పెట్టుబడిదారీ రాజ్యం హేతుబద్ధం కానవసరంలేదు. రాజ్యానికి జోక్యం చేసుకునీ అధికారం ఉండరాదు. 1978లో నయా ఉదారవాదం. శ్రేయోరాజ్యాన్ని కుదించే ప్రయత్నాలు చేసిన మార్గరెట్ ధాచర్ 4సార్లు వరసగా గెలిచింది. ఎందుకు ప్రజలు గెలిపించారు? Tax payer’s రాజ్యం కావటం వల్ల. నా పైసా వేరొకరికి ఉపయోగించే నైతిక అధికారం రాజ్యానికి ఎక్కడిదన్నది పన్ను చెల్లింపుదారుల ప్రశ్న. 1980ల తరవాత కీయిన్స్ దాదాపు బహిష్కరించబడ్డాడు.
హంటింగ్ టన్ కమ్యూనిస్టు వ్యతిరేకి. అమెరికా కలగచేసుకున్న దేశాలలో కమ్యూనిస్టు భావాలు పెరిగాయి. క్లాష్ ఆఫ్ సివిలిజేషన్స్ లో అతని వాదన గురించి చాలా వివరంగా చెప్పారు అంజిరెడ్డి. 21వ శతాబ్దంలో ప్రాశ్చాత్యదేశాలకు ప్రమాదం ఎక్కడనుంచి వస్తుంది?
1. యుగొస్లావియాలో భిన్న జాతుల మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి. కారణం భిన్న నాగరికతలు.
2.ఇస్లామిక్ నాగరికతే ప్రమాదకారి. వివిధ దేశాలలో ఉన్నా నాగరికతగా వారంతా ఒకటే. ఆధునికీకరణకీ నాగరికత విలువలకీ కుదరదు.
3. గణాంకాల ప్రకారం ప్రాశ్చాత్యదేశాల ఆధిపత్యం తగ్గుతోంది. చైనా, జపాన్, ఇండోనీషయా, మలేసియా వంటి ఆశియా దేశాల ప్రాబల్యం పెరుగుతోంది. 21వ శతాబ్దంలో ఆర్ధికంగా పుంజుకుంటూ రాజకీయ అధికారం ఆశిస్తాయి.
4. క్రిస్టియనైజ్ చేస్తేనే ప్రాశ్చాత్యుల అదికారం నిలబడుతుంది.
మనం సైద్ధాంతిక కృషి చేయాలి. అంటూ ముగించారు అంజిరెడ్డి.
కమ్యూనిస్టు పతనానంతరం ప్రపంచానికి కొత్త శత్రువు అవసరం అని హంటింగ్టన్ చెప్పటాన్ని రాయుడు వివరించటంతో కలయిక ముగిసింది.
సురేష్ ఆరంభించిన ఈ ఆలోచనాపరుల కలయిక ఆచరణకి సంబంధించిన ప్రతిపాదన చేయలేదని కొందరు సమావేశం తర్వాత అసంతృప్తి ప్రకటించారు. ఏమైనా వ్యక్తిగతంగా అనేక విషయాలు కలబోసుకున్నందుకు నాకు కొంత తృప్తి కలిగింది. ఇటువంటివి రాజకీయ అభిప్రాయ భేదాలు పక్కనుంచి కలిసి ఆలోచించే ప్రయత్నాలని నేను అర్ధం చేసుకుంటున్నాను. సైద్ధాంతిక కృషి నేటి అవసరమన్న అంజిరెడ్డి గారి మాటతో ఈ కలయిక విశేషాలను ముగిస్తున్నాను.