9-12-2013

నాకు సురేష్ అనే ఆప్తమిత్రుడు ఉన్నాడు. అతను కొంతకాలం బెంగళూరులో ఉన్నాడు. టైటానిక్ కథతో ప్రసిద్ధుడు. ఆతగాడు నాకు ఓ పజిల్. నాకు తెలిసినమేరకు నాలాగే సమాజం గురించి ఆలోచిస్తాడు. ఆ ఆలోచనతోనే కథకులను అపుడపుడు కలిపి మాటలాడించే ప్రయత్నం లేదా కార్యక్రమం ఒకటి చేస్తుంటాడు. డిసెంబరు 1,2 తేదీలలో అతను కొందరు ఆలోచనాపరులను కలిపే ప్రయత్నం చేసాడు. గుంటూరులో ఈ సమావేశం జరిగింది. దానికి నేనుసైతం వెళ్లాను. చాలామంది ప్రసిద్ధులను కలవటం, రాయుడుగారి సాయంకాల ఆతిధ్యం, రాత్రి కబుర్లు వగైరాలతో బాగానే కాలం దొర్లింది. కాలం దొర్లించదలుచుకుంటే ఇంతమంది కలిసి కష్టపడ నవసరం లేదు గదా! అంతకుమించి ఏదో జరగాలన్నది సురేష్ ఉద్దేశ్యం అన్నది విదితం.

అదేమిటి? ఎంతవరకు నెరవేరింది?

ఈ సమావేశం గురించి నలుగురితో పంచుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నేను కొంత నోట్సు రాసుకున్నాను. సురేష్ మీరు రాస్తే బాగుంటుందని కూడా సూచించాడు. కాని ఎలా పంచాలి? ఏం పంచాలి? చివరకు నా దృష్టికోణం తోనే అని నిశ్చయించుకుని, నా బద్దకాన్ని వదిలించుకుని ఈ రోజు మొదలిస్తున్నాను.

సురేష్ పజిల్ అన్నది నాకు చాలాకాలంగా ఉన్నదే. ఈ సమావేశం ఏర్పాటులో అతని ఉద్దేశ్యం లేదా లక్ష్యం లేదా యోజన అతనితో మాటాడాక కూడా నాకు స్పష్టం కాలేదు. అతను అన్నదాని ప్రకారం రాయుడు గారితో పిచ్చాపాటీ, లేదా ఓ రోజు లాంటి పేరు ఈ సమావేశానికి ఉంచాలనుకున్నాడు. రాయుడు దానిని అంగీకరించలేదు. ఆయన పట్ల సురేష్కీ మామిత్రబృందంలో ఇతరులకి ఉండే సాధారణ అభిప్రాయం ఆయన భిన్నంగా ఆలోచిస్తారు. సమాచారం(data) ఆధారంగా మాటలాడతారు. లోకంలో పేదలు, పెద్దలు అనే విభజన, అసమానత ఉందనేది వాస్తవం. ఈ ఉండటమనేది అవాంఛనీయమనేది, ఉండకుండా చేయటం సాధ్యమనేది కొందరు నమ్ముతారు. వీరిలో ఎక్కువమందిని కమ్యూనిస్టులు అనవచ్చు. రాయుడు గారు కూడా అవాంఛనీయమని భావిస్తారు. అది తగ్గుతున్నదనే అంశాన్ని సమాచారం ఆధారంగా చూపిస్తారు. మౌలికంగా ఆయన భిన్నత్వం అక్కడ ఉంది. (రాయుడి విషయంలో నాకున్న స్పష్టత ఉంది.) దానిని సురేష్ అలాగే అర్ధం చేసుకున్నాడనే నా ఊహ. ఈ విషయాన్ని –other point of view- అని సురేష్ అనుకుంటున్నాడని నేను  అనుకుంటాను. అంటే ఈ భిన్న దృష్టికోణాన్ని (రాయిడి భాషలో ప్రాపంచిక దృక్ఫధం) సురేష్ ఎవరికి పరిచయం చేయదలుచుకున్నాడు?

సమావేశపరిచిన వారిలో ఎక్కువమంది కమ్యూనిస్టులు, కమ్యూనిజం ఇష్టులు. వారిలో ఆలోచనా రంగంలో మాత్రమే పని చేస్తున్నవారు, ఆచరణ రంగంలో పనిచేసిన వారు, చేస్తున్నవారు ఉన్నారు. వారందరికీ ఒక సమస్య ఉంది. What to do? What to think? ఇది సురేష్ కి కూడా ఉంది. ఈ భిన్నదృష్టికోణం యొక్క పైపై ఊహలు పక్కనుంచి,  దీని లోతు పరిశీలించవలసిన అగత్యం ఉందని సురేష్ అస్పష్ట భావం. అప్పుడు ఒక మధనం ఆరంభం అవొచ్చన్నది అతని ఆశ కావచ్చు.

సురేష్ ఆలోచించవలసిన విషయాలు రాయుడి ఆధారంతో పట్టీ తయారుచేసాడు. వాటిని చదివి సమావేశాన్ని ఆరంభించాడు. దాముని ఈ సమావేశానికి మోడరేటర్ అన్నాడు. తర్వాత రాయుడిని ఆరంభించమన్నాడు. ఆయన మా బెంగళూరు పద్దతిలో స్పష్టంగా ఆరంభించారు.

-మాటలాడుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వ్యవసాయం ప్రధానమైనది. 94-95లో డంకెల్ ఆతర్వాత గ్లోబలైజేషన్ వ్యవసాయం ఎకనమిక్సులో మార్పులు తెచ్చాయి. వాటి మంచిచెడ్డలను చర్చించే ముందు కొన్ని ప్రశ్నలు. సోషలిస్టు సమాజం ఎలా ఉంటుంది? సమానత ఎందులో ఉండాలి? ఎందులో సాధ్యం?

అ. కనీస అవసరాలు. కూడు, గూడు, గుడ్డ లేదనే పరిస్థితి పోవాలి. దానికి తగిన ఉత్పత్తి ఈనాడు భారతదేశంలో ఉంది. దానిని అందరికీ పంచే పంపిణీ వ్యవస్థలో సమస్య ఉంది. దీనిలో సమానత అవసరం, సాద్యం.

ఆ. జీవిత అవసరాలు. విద్య, వైద్యం అందరికీ అందాలి. ఏదోరూపంలో అవి ఈనాడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి.

ఇ. జీవనశైలి అవసరాలు. ఉండే ఇల్లు , ధరించే బట్ట, ప్రయాణం చేసే వాహనం వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటిల్లో మార్పులు ముందు పైవారి నుంచే మొదలవుతాయి. క్రమంగా అవి క్రిందవారికి చేరతాయి. ఉదాహరణ టూత్ పేస్టు వాడకం.. ఫోను.. వంటివి. వీటిలో సమానత ఆవసరమూ కాదు. సాధ్యమూ కాదు.

దీనిమీద ముందు రౌండ్లో చర్చిద్దాం.

ఇలా ఆయన చేసిన ఆరంభానికి ఎవరేమన్నారు?

రేపు రాస్తాను.