ట్యాగులు

2. బొంబే వచ్చింతర్వాత పై విషయం గురించి ఉపన్యాసం ఉందని పోస్టరు చదవి తెలుసుకున్నాను. చిత్రంగా ఉందీ అంశం.. తప్పకుండా వెళ్లాలనుకున్నాను. మాటలాడేది హరీశ్ హందే. కర్నాటకలోని కుందాపురంలో పుట్టి, రూర్కెలాలో పెరిగిన ఈయన ఖరగపూర్ ఐఐటిలో ఎనర్జీ ఇంజనీరింగులో బిటెక్ చదవాడు. తరవాత అమెరికా మసాచుసెట్స్ విశ్వవిద్సాలయంలో పిజి, పిహెచ్ డీ చేసి భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1995లో SELCO అనే సామాజిక వ్యాపారసంస్థను బెంగళూరులో స్థాపించాడు. ఈ సంస్థకి కర్నాటక, మహరాష్ట్ర, బీహార్, గుజరాత్, తమిళనాడులలో 38 ఎనర్జీ సేవా కేంద్రాలు ఉన్నాయి. గ్రామీణ భారతంలో సౌరశక్తిని వినియోగించి పేదప్రజలకి ఉపాధి కల్పనలో, ఆదాయం పెరగటంలో సహాయం చేయటం ఆయన చేపట్టిన కార్యక్రమం. రామన్ మెగాసెసే అవార్డుతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ బహుమానాలు పొందిన ఈ social entrepreneur ఉపన్యాసం వినటం ఒక అనుభవం. సుమారు 500 పట్టే సభాంగణం నిండిపోయింది.

ఆయన చెప్పిన కొన్ని అనుభవాలు, ఆలోచనీయ అంశాలు పంచుకోవటం రెండవ బాకీ.
అ. ఒక వీధివ్యాపారి సంగతి. ఉదయం 1000రూ. అప్పు తీసుకోటంతో ఆరంభం. అందులో 100 వడ్డీ అప్పుడే తీసుకుంటారు. 900 వందలతో సరుకు కొని వీధి వీధీ తిరిగి అమ్ముకుంటాడు. అందులో పోలీసు మామూలు, రౌడీ జులుం 100. బండి అద్దె 50. సాయంకాలం మిగిలిన సరుకు నిలవ వేసుకొనే సదుపాయం లేదు. ఏదో ధరకి అమ్ముకోవాలి. కనీసం 200 నుంచి 300 సంసారపోషణకి కావాలి. ఇతను చేసే సేవ ఇంటింటికీ సరుకు చేర్చటం. ఇతనికి ప్రభుత్వం.. ఏమైనా సహాయపడుతోందా .. వీళ్లకి పోటీగా ఉండే మాల్స్ కి లభించే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, 5, 6 శాతం బాంకు రుణాలు లెక్కవేయండి సబ్సిడీలు ఎవరికి అందుతున్నాయి.
ఆ. నేను ఐఐటిలో ఎలా చదివాను.. ఎంత సబ్సిడీ ఫొందాను.. ఆ ధనం ఎవరిది.. పేదల నుంచి నేరుగానూ, మరో రూపంలోనూ ప్రభుత్వం పోగుచేస్తున్నది కాదా.. దానితో లాభపడిన నేను ఎవరికి లాభపడాలి.. ఎవరి లాభాలకి ఉపయోగపడుతున్నాను..
ఇ. నేను మలేసియా, శ్రీలంక, ఆఫ్రికా లలో పేదల మధ్య పనిచేసాను. ప్రపంచంలో పేదలు ఎక్కడున్నా వారికి నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే ప్రపంచంలోని పేదలు పోగుచేసిన సంపదతోనే నేటి విద్యావ్యవస్థ ఏర్పడింది. అందుకే నా దేశంలో పేదలకి మాత్రమే పరిమితం కావాలనుకోను. నా నైపుణ్యం వీరికి ఎలా ఉపయోగించటం..
ఈ. బీహార్ లో పని చేయటం చాలా కష్టం అంటారు. ముంగేర్ జిల్లాలో మూడేళ్లుగా పని చేస్తున్నాను. వారికి నా టెక్నాలజీతో 1200 గ్రామాలకు విద్యుత్తు ఇవ్వగలిగాను. ఒక గ్రామంలో ఆకులు కుట్టటం వృత్తి. వారు ఒకరోజు ఆకులు పోగుచేస్తారు. మరునాడు మాత్రమే కుట్టగలుగుతారు. రాత్రి దీపం వల్ల వారు రెండురోజుల పని ఒకరోజులో చేయగలిగారు.
ఉ. వ్యవసాయంలో నిపుణులు పనిచెయ్యటం లేదంటారు. పనిచేస్తున్న వారెవరు? జీవితమంతా అక్కడ పని చేస్తున్నవారి అనుభవానికీ, వారు పెంచుకున్న నైపుణ్యాలతో పోలిస్తే 4,5 ఏళ్లు చదివిన వారు ఏ పాటి? ఈ దృష్టికోణంలో తప్పు కనిపించటం లేదా.. మేం చెయ్యవలసింది వారివద్ద నేర్చుకోటం.. వారి అవసరాలకు కావలసిన పరికరాలు డిజైన్ చేయటం.
ఊ. నాకూ, నీలిమా మిశ్రాకు కలిపి రామన్ మెగాసెసే అవార్ఢు ఇచ్చారు. న్యాయంగా అది ఆమెకు మాత్రమే రావాలి. నా అమెరికా చదువు, నా ఇంగ్లీషుల వల్ల నేనందులో వాటా చిక్కించుకున్నాను. మనదేశంలో ఇంగ్లీషుకి ఉన్న విలువ ఇలాగే ఉండాలా అంటూ చాలా సంగతులు చెప్పారు.
ఎ. ఒక అబ్బాయి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంచి ప్రశ్న వేసాడు. మా తలిదండ్రులు మా జీవితాలు సుఖంగా ఉండాలని ఐఐటిలకి పంపుతారు. యంత్రాలలా మేం చదువుతాం. మేం మాగురించి తప్ప మరి దేని గురించైనా ఆలోచించే మోటివేషన్ ఎలా వస్తుంది? దానికి హరీష్ సమాధానం – ప్రశ్నతో నిరసన చేయటం మనకి అలవాటయింది. జవాబుతో నిరసన మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ ప్రశ్న నీకు కలిగాక జవాబు నువ్వే ఆలోచించాలి. ఉదాహరణకి నువ్వు స్కూల్స్ లో విద్యార్ధులకి మోటివేషన్ అవసరం చెప్పవచ్చు. నీ పిల్లలని ఈ విషవలయం నుంచి తప్పించవచ్చు. ఇవి కేవలం ఉదాహరణలు.
గుర్తున్నమేరకు చెప్పాను.
ఒక పెనుమార్పుతో అనేక రంగాలలో మార్పుల గురించి ఆలోచించే మనిషిని నేను. అనేక మార్పుల గురించి మాటలాడేవారు అసలు మార్పు జాప్యానికి తోడ్పడతారని విన్నవాడిని. నా వివేచనా స్వభావం వల్ల ఆకలిగా ఉన్నపుడే(అవసరాల వల్లే) పెనుమార్పులు సాధ్యమన్న అంచనాలో పొరపాటుందని అనుకునే మనిషిని. మనిషి ఎదగాలని కలలు కనటం ఓ స్థాయి తరవాతనే సాధ్యం అని నేను కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. ఆ స్థాయికి చేరిన వారిని రాజ్యం ఒకరికి ఒకరికి శత్రువుని చేయటంలో ప్రస్తుతం ముందంజలో ఉంది. కాని అదిక సంఖ్యాకులు కలలు కనే స్థాయికి చేరాక రాజ్యం స్వభావం మారక తప్పదు. ఇటువంటి సామాజిక ఆలోచనాపరుల ఇలాంటి ప్రయత్నాలు ఆ దిశగా ఆహ్వానించవలసినవే.