20-9-2013
ఈ మధ్యలో నలుగురితో పంచుకోవలసినవి కొన్ని బాకీ ఉన్నాయి.
1. బొంబే వచ్చేముందే స్వాతిలో ఒక వ్యాసం చదివారు రామలక్ష్మిగారు. ఒకటి భగవతి, అమర్త్యసేన్ ల ఆర్ధిక నమూనాల గురించి. గుజరాత్ ఆర్ధికాభివృద్ధికి భగవతి నమూనాట .. ఏంటంటారూ.. ఇన్ప్రాస్ట్రక్చర్ ఏర్పరచటం. దాన్ని ఉపయోగించుకుని ప్రజలు కొత్త కొత్త సంపాదనా మార్గాలను ఏర్పరచుకోడం… దానివల్ల ఉపాధి అవకాశాలు పెరగటం… అందరూ ఆర్ధికంగా అభివృద్ధి చెందటం. ఇన్ప్రాస్ట్రక్చర్ అంటే ఏంటి.. అని అడిగారు ఆవిడ. రోడ్లు, ఆస్పత్రులు, పరిశ్రమల పార్కులు, టెలికమ్యీనికేషన్ అంటూ తోచిందేదో చెప్పాను. ఆస్పత్రి అనగానే .. ఆవిడ తెగ చదువుతుంది గదా.. మరో వ్యాసం గుర్తొచ్చింది రామలక్ష్మికి. అదీ గుజరాత్ గురించే. అక్కడ అద్దెతల్లుల ఆస్పత్రులు ఉన్నాయిట. అవి పూర్తిగా అద్దెతల్లులను సమకూర్చటం.. వారి గర్భాలలో వేరే ఆడా, మగా విత్తులను నాటటం.. నాటిన నాటినుంచి పంట వచ్చేవరకూ క్షేత్రాలను, వాటి హక్కుదారులైన భర్తలను, లబ్ధిదారులైన ఇతర కుటుంబ సభ్యులనూ సంరక్షించటం.. పంట వచ్చాక ఖర్చులనూ లాభాలనూ లెక్క చూసుకుని ఎవరికి కావలసింది వారి చేతిలో పెట్టి తామూ కొంత చేసుకోటం.. ఇదీ కార్యక్రమంట. ఇంతమందికి.. జీవనోపాధి లభిస్తుంది. మూడు నాలుగు పంటలతో ఒక కుటుంబం కుటుంబం ఆర్ధిక స్థితి మారిపోతుంది. వారి బిడ్డలు కాకపోయినా మనుమలు కడుపులను అద్దెకు తెచ్చుకునే ఉన్నత స్థితికి ఎదగవచ్చు. చిత్రం చాలా పచ్చ పచ్చగా ఉంది. అయితే నా మట్టిబుర్రకి ఓ అనుమానం వచ్చింది. – ఇంత మార్కెట్టుందిటోయ్ – అన్నాను . నా తెలివితక్కువకి రామం గారు పకాలున నవ్వారు. –పెద్ద కబుర్లు చెపుతారు గదా.. ఆమాత్రం తెలియదా.. అన్నారు. బుర్ర గోక్కున్నాను. “అదేంటండీ పిల్లలని కనటానికి టైం లేని సాఫ్టువేరు జంటల సంగతి ఏంటి.. కెరీరులో వెనకబడరు.. ఆడా మగా పోటీలుగా పరుగెట్టవచ్చు. పిల్లలవి వాళ్ల డిఎన్ఏలే. సంపాదించిన ఆస్తులు, పెట్టిన షాపులు చూసుకోటానికి వారసులు శ్రమ లేకుండా కాస్తంత ఖర్చుతో పుట్టుకొస్తారు. శీలం సమస్య లేదు. కామం కోసం కూడా టైం కేటాయించనవసరం లేదు.. సగం మంది పని చెయ్యటం.. సగం మంది కనటం బావుంటుంది గదా” అందావిడ. రేపు దేశమంతా అద్దెతల్లుల ఆస్పత్రులు పెట్టాలని ప్రభుత్వాలు పధకాలు వెయ్యొచ్చు.. మన నియోజకవర్గంలో ప్రతి వీధికీ తెప్పిస్తామని ప్రజాప్రతినిధులు వాగ్దానాల ఖాతాలో చేర్చుకోవచ్చుగదా అని నేను నా ఊహలు కొనసాగించాను. ఇది నలుగురికీ పంచేసుకోవాలని .. మన దేశం గురించి పెసిమిస్టులు ఎవరైనా ఉంటే .. వాళ్లని మార్చెయ్యాలని ఎఫ్బీలోకి దూర్చేసాను.