ట్యాగులు

,

20-8-2013
రాత్రిళ్లు రాసుకోటానికి బాగుంటుంది. సత్యం తలపు తడుతున్నట్లుంటుంది. నిజంగానే ఈ బ్లాగు మీద, ఎఫ్బీ మీదా మనసు కొంత ఎడమయింది. మొదటి దెబ్బ యాజి గారి కథ మీద నేను కదిలి, దాని గురించి కొంత చురుకు ప్రదర్శించాను. దాన్ని దుడుకు అని ఒక సహ ఆలోచనాపరురాలు భావించారు. నాకు కోపం రాలేదు కాని, బాధ కలిగింది. దీనికి ఉన్న అప్రకటిత సామాజిక నియమాలు(etiquette) నాకు అవగతం కాలేదు అనుకున్నాను కొంతకాలం. పల్లెటూరి వాళ్లకూ, అంతగా విద్యార్హత లేని వారికీ సహజంగా ఉండే ముడుచుకుపోయే గుణం 28 ఏళ్లుగా బెంగళూరులో ఉన్నా నాకు పోలేదు. తగని చోట తలదూర్చ రాదనిపించింది. అది కొన్నాళ్లు.
వ్యాసాలలో నా భాష గురించి, అందరూ వాడే పదాలను ఎక్కువగా వినియోగించుకోకపోటం గురించి ఒక మిత్రుడు నాతో మాటలాడాడు. దానివలన నా వ్యక్తీకరణలో బిగుసుకుపోటం కనిపిస్తుందని ఆయన పరిశీలన. నేను తీసుకునే విషయంలోని క్లిష్టత వల్ల, నేను అర్ధం చేసుకునీ పద్దతిలోని మౌలికత వల్ల అది అలా జరుగుతున్నదా లేక సామర్ధ్యలోపం వల్లనా అని ప్రశ్నించుకున్నాను. అసలు ఆయన అన్నది నీవు పట్టించుకోవద్దు, ప్రతి వారికీ వారికి సహజమైన ఒక పద్దతి ఉంటుంది- అన్నారు కారా మాస్టారు ఒకమారు. అదంతా నా మనసులో ఉందనుకుంటాను.. కొంత హాస్యంగా బ్లాగులో రాయటం ఆరంభించాను. ఇది కూడా ఒక వ్యూహంతోనే చేసాను. ఈ సామాజిక నెట్టువర్కులని అర్ధం చేసుకోవాలని, ఆరునెలలు ఒక అవధి అని నా మనసులో ఉంది. మనిషికి తనను ప్రదర్శించుకోవాలనేది ఒక ప్రేరణ. లోతుగా పరిశీలిస్తే అది ఒక సామాజిక చోదకశక్తిగా నేను చాలాకాలంగా ఒక అవగాహనకి వచ్చాను. ఆ అవగాహన నన్ను నా నియమాలనుంచి విడుదల ఇవ్వలేదు గాని, తోటి మానవులను మరింత ఆకళింపు చేసుకోటానికి నాకు ఉపయుక్తమయింది. అయితే విపరీత ప్రదర్శన నన్ను నిరాశ పరిచింది. తెలిసిన వారి పట్ల లోకానికి వారు అలా ఉండరన్న ఓ ఊహ ఉంటుంది. బహుశా నాలో ఉండే ఆ ఊహ ఊహేనని అనిపించింది. అది కొన్నాళ్లు.
కథానిలయం పని రోజురోజుకీ ఎక్కువవుతోంది. అందులో దిగేనాడు రిటైరయిన మూడేళ్లు అనుకున్నాను. ఆరేళ్లు ముగిసాయి. శారీరకంగా అంతో ఇంతో సత్తువ ఉండగానే నేను ప్లాన్ చేసుకున్న 3 నవలలు పూర్తి చెయ్యాలని గట్టిగా అనుకుంటాను. మూడూ ఆరంభించి ఇరవై ఏళ్లు. వాటికోసం చదివిన పుస్తకాలు, రాసుకున్ననోట్సులు బెంగళూరుకీ, ఇక్కడికీ తిరగటంలో తిప్పటంలో పోతాయేమోనని అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు చేతికి అందగానే పెద్దపెద్ద పరిశోధనలలా వాటిని ప్రకటించటం మనలో హెచ్చు. ఒకప్పుడు మన భారతీయ తాత్వికత వల్ల తను చేస్తున్నదాని పట్ల వ్యక్తికి కొంత detachment ఉండటమూ, ఆ కారణంగా జనానికి వారి పట్ల attachment ఏర్పడటమూ జరిగింది. అది మన జాతి స్వభావమైపోయింది. అది లేని వారు అల్పవిషయాలకే సంతుష్టులయారు. ఉన్నవారు నిర్లిప్తులయారు. ప్రాశ్యాత్యులలో లోతులు చూడాలన్న జిజ్ఞాసతో పోలిస్తే మనం ఆ విషయకంగా చాలా నేర్చుకోవలసింది ఉంది. ఇలాంటి ఆలోచనల వల్ల నేను రాసేవన్నీ చాలాకాలం పడుతుంటాయి. ఒక విషయానికి చెలామణీ కొన్నాళ్లే ఉంచటం వార్తా, పత్రికా మాధ్యమాల అలవాటు. జనం జ్ఞాపకశక్తి కన్న మన ఫోర్త్ ఎస్టేట్ శక్తి పలచన. అందువల్ల చెలామణీ అయిపోయాకగాని నా రాత ముగియకపోటం అపుడపుడు జరుగుతోంది.
చివరగా- ఆగస్టు 29 గిడుగు వారి 150 వజయంతి. ఈ సందర్భంగా గిడుగు వారి మీద రాసినవీ, వారు తమ స్వంత పత్రిక తెనుగులో రాసినవీ కొన్ని బ్లాగు ద్వారా ఒక వారం అందించాలని ఆలోచన. గిడుగు వారి వ్యావహారిక భాషావాదానికి వ్యతిరేకులైన చెళ్లిపిళ్ల వెంకటశాస్త్రి గారు రాసిన నివాళి ఈ క్రింది లంకెలో చదవగలరు. ఒకనాడు భావజాలంలో విరోధులైనా ఒకరి కృషిపై మరొకరికి గల గౌరవం గమనించగలరు. ఈనాడు మనం వారినుంచి నేర్వవలసింది ఎంతో ఉందని నేను అనుకుంటున్నాను.
gidugu-chellapilla