2013-07-26
అర్నాద్ నమ్మకం రామలక్ష్మి అపనమ్మకం
రోజు బాగోపోతే తాడు పామై కరుస్తుంది. బావుంటే పాము తాడులా పక్కనించి వెళ్లిపోతుంది. లేకపోతే నా ఆప్తమిత్రుడు అర్నాదూ నా భార్య రామలక్ష్మీ కలిసి ఈరోజు పొద్దుట లేస్తూనే నా జుట్టు పీకెయ్యటమేంటి .. ఆయన గారేమో ఓ కథ రాసాడు. పేరు నమ్మకం అపనమ్మకం అని పెట్టాడు. ఊరుకోక దాన్ని పత్రిక్కి పంపాడు. జగన్నాధశర్మగారు ఊరుకోక నవ్య 1-02-2012 సంచికలో అచ్చోసి జనం మీదకి వదిలారు. జనానికి ఏమైందో నాకు తెలీదు గాని పోటీల్లో మంచి కథలు చదివేవాళ్లకి మాత్రం మావాడి కథలు ఈమధ్య తెగ నచ్చీసాయి. వాళ్లు ఊరుకోక ఓ ముప్పైవేలు బహుమతులు ఇచ్చారు. ఆ డబ్బులు పెట్టి నాలాంటళ్లని బెంగలూరునుంచి రప్పించి మందోసి పొగడమంటే నచ్చితే కొంచెం పొగిడి నచ్చాపోతే బాగా తెగిడి మందుదాతా సుఖీభవ అని నిద్రోయేవాడిని. అబ్బే మావాడికి అంత సీను లేదు. ఇవి పాలాండీ.. ఇందులో స్పిరిట్ లేదుగదండీ అంటాడు దొంగ మొహం పెట్టి. ఊరుకోక మా గురువు ఒహాయన ఉన్నాడు. (కాళీపట్నం రామారావు అని బాగా పెద్దాయన. నా అనుమానం ఏంటంటే ఈయన గారి కథలన్నీ కారాగారం లోంచే ఇప్పుడూ బయటకి వస్తున్నాయి. నేను, అర్నాదూ విశాఖనే మంత్రులుగా పరిపాలించే రోజుల్లో మా రాజు గారి కారాగారం నుంచే మా కతలు బైటకి వచ్చేవి. నాకా చాన్సు పోయింది. అర్నాదు ప్రభత్వంతో కుట్ర పన్ని నన్ను బెంగళూరు నెట్టేసాడు.) ఈ డబ్బులు పట్టుకుని వీటిని ఎలా తగలెయ్యాలో చెప్పుమీ అనీగానే అవ్విలా ఇచ్చెయ్ కథానిలయంలో వేసి తగలేస్తాననీయాలి కాని ఏకళ నున్నాడో మహానుభావుడు పుస్తకం వేసి తగలెయ్ అన్నాడు. ఆపద్ధర్మం అని పేరుపెట్టి పాలపిట్ట గుడిపాటి సహకారంతో ఓ పుస్తకం వేసాడు. దానికి ఎల్లుండి 28న ఆవిష్కరణ. దానికి రమ్మని ఆర్డరేస్తూ కంటాస్పత్రినుంచి కళ్లనీళ్లెట్టుకున్నాడు అర్నాద్. ఇవ్వి వేసానుగాని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అంటాడు. అసలెందుకు రాసావు.. ఆగక.. ఆమీదట ఎందుకు వేసావు పుస్తకంగా.. తీరక.. అందుకే అనుభవించు అన్నాను. ప్రసూతి వైరాగ్యంలాగే పుస్తకవైరాగ్యం తెలుగు రచయితల ముహాన రాసిపెట్టి ఉంది. ఈ విషయం గురజాడే పసికట్టి చెప్పేసాడు. అసలు ఆయన తరవాత వాళ్లకి ఏమైనా పసికట్టటానికి మిగిల్చాడా అని నా అనుమానం. మామూలుగానే నాకో కాపీ మొహాన్న కొట్టి చదూకో బాగుపడు అన్నాడు. నేను కథానిలయం పనిలో కూరుకుపోయున్నాను గదా అందులోనించే ఊఁ అని మూలిగాను. ముందుగా ఈయనెందుకు బాగుపడాలి అని రామలక్ష్మిగారికి దుర్బుద్ధి పుట్టింది. చదివేసి తను బాగుపడిపోవాలి కదా.. లేదు. భర్తా బాగుపడాలని భార్య కోరికగదా. నువ్వు చదివీ వరకూ బాత్రూం తలుపు తియ్యనని గొళ్లెం పెట్టేసింది. నేను తిక్కలాడిని గదా.. ఆవిడ మాటెందుకు వినాలి అని చదవని కథలో రెండు పూర్తి చేసి గొళ్లెం తియ్యి అన్నాను. ఈ కథలో పాత్రల పేర్లు చెప్పూ అంది చదవలేదన్న నమ్మకంతో. చెప్పలేకపోటంతో మళ్లీ చదివాను.
అక్కడనుంచి అసలు కథ ఆరంభం.
నమ్మకం అపనమ్మకం అన్న కథలో ఇద్దరు మిత్రులు ఉంటారు. కథ చెప్పే ఆయనకి నమ్మకాలు లేవు. కథలో ఎత్తుకున్న నమ్మకం మైల. చావు మైల, పురిటి మైల. రెండవది కూడా బాగా పట్టించుకోటమంటే నమ్మకాల తీవ్రతలో పైస్థాయి అన్నమాట. అటువంటి వారు కథకుని భార్య, ఆమె సోదరుడు ప్రకాశం. మూడు మరణాలు జరుగుతాయి. ఒకటి జాతకం ప్రకారం ప్రకాశం కొడుకు పోతాడు. 3వ ఏట పోతాడు. రెండవది ప్రకాశం తండ్రి మరణం. ఇది ప్రధాన సంఘటన. ఆయన ఆస్పత్రిలో ఉంటాడు. అదే సమయానికి ప్రకాశం కూతురి పెళ్లి. కథకుడు ఆస్పత్రిలో ముసిలాయనకి కాపలా ఉంటాడు. ముహూర్తానికి ముందే ఆయన కళ్లు మూస్తాడు. ఆ విషయం వెంటనే తెలియజెయ్యాలా లేక మూడుముళ్లూ పడ్డాక తెలియజెయ్యాలా అన్నది కథకుడి డైలమా. వైద్యునితో తర్జన భర్జన. చివరికి పెళ్లి అయాకనే బయటపెడతాడు. ఆతర్వాత మూడు నెలలకి కొత్త పెళ్లికూతురు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. పెళ్లి ఘడియలలో మైల ఉన్నదన్న విషయం బైటపడుతుంది. ప్రకాశం తన కూతురు మరణానికి కారణం నీ అబద్దమే అంటాడు. సన్యాసులలో కలిసిపోతాడు. కథకుడు తన మిత్రుని రాక కోసం, అతని క్షమకోసం ఎదురు చూడటంతో కథ ముగుస్తుంది.
ఈకథ మూఢనమ్మకాలను బలపరచుతోంది గదా – అంటారు రామలక్ష్మి. ఆవిడ గురువు గారు రావిశాస్త్రి. బలిపీఠం నవల మీద అభిప్రాయం అడిగారుట రంగనాయకమ్మ. కులాంతర వివాహాలు జరగాలనుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారుట రాచకొండ. జరగాలనే అని జవాబిచ్చాక మీ నవల చదివాక పాఠకుడు ఏమనుకుంటాడు.. అని ప్రశ్నించారుట. ఈ వినికిడి కథ చెప్పి అర్నాద్ ఉద్దేశ్యాన్ని ఆకథ చెపుతుందా అని నిలదీసింది. దొడ్డిదారిన తప్పించుకుందామని ఆయన ఉద్దేశ్యం నీకు తెలుసుగదోయ్ – అన్నాను. అర్నాద్ నాకు తెలుసు గనక తెలుసు. రచయితతో పరిచయం లేని పాఠకుడి సంగతేంటి – అంటూ నన్ను నిలబెట్టేసింది. తమ్ముడు తనవాడైనా తగువు సరిగ్గా విప్పమంది. ఆయన్నే అడిగెయ్యరాదూ కడిగెయ్యరాదూ అంటూ అతి తెలివి చూపించబోయాను. నీ నసుగుడు కట్టిపెట్టి ఓ పాఠకుడిగా మాట్టాడు, నిజంచెప్పి జనాన్ని కంగారు పెట్టేస్తున్నాననుకొని ఊఁ అతలాకుతలమై పోతుంటావుగదా నాతో చెప్పటానికి నీకేం రోగం అంటూ జాడించింది.
తప్పలేదు. ఆలోచించాను. అర్నాద్ నాకు తెలుసు. నా అరిచెయ్యి ఎంత బాగా తెలుసో అంత బాగా తెలుసు. దాన్ని బహుశా దిద్దిన మాస్టారు గురించీ నాకు తెలుసు. రచయిత నమ్మకాలు ఏవైనా వాటిని సాహిత్యంలో బలపరచ రాదన్నది ఆయన నమ్మకం. అంటే సంశయంలో రచయిత ఉన్నపుడు లోకానికి ఏది మంచి అని రచయితకి నమ్మకమో అదే చెప్పాలి. అదీ కారా ఆలోచన. కనక కథ రాసిన అర్నాద్ ఉద్దేశ్యం నమ్మకాలకు వ్యతిరేకమైనదే. కథకుడు ప్రకాశం క్షమ ఆశించటంలో కూడా ఒక సహజ మానవీయ లక్షణమే ఉంది. అది కొత్తగా ప్రకాశం నమ్మకాలను బలపరచదు. బలపరిచేది సంఘటనల కూర్పు. మొదటి మరణం పాత్ర నమ్మకం ప్రకారం జరిగింది. అది యాదృచ్ఛిక ఘటన అన్న తర్కం నిలవాలంటే మూడవ మరణం జరగకూడదు. నమ్మకాలని వమ్ము చేసేటట్టు ఉండాలి. నమ్మకాలపై పాఠకునికి అపనమ్మకం కలిగంచాలంటే రచయితలు సాధారణంగా చేసే సంఘటనల కూర్పు ఇది. (సరళమైన కథని నీతి కథ అంటుంటారు. ఉదాహరణకి ఆవు బిడ్డకు పాలిచ్చి పులి దగ్గరకి తిరిగొచ్చీటం సత్యమును పాలింపుము అనే నీతిని ప్రతిపాదిస్తుంది.) ఇది నీతికథని మించుతుంది. కాక రెండవ మరణం ఆధారంగా ఒక డైలమా.. అక్కడ కథ చెప్పేవాడి నిర్ణయం.. మాత్రం కథ చేస్తే ఇలాంటి సందర్భాలు ఆధునిక జీవనంలో ఎక్కువ కనక ఒక పరిష్కారాన్ని సూచిస్తాయి. కథకుడి తర్జనభర్జనలో మన కర్మ నమ్మకాన్ని పట్టుకొచ్చి పెడితే అది కథకుడి పరిష్కారన్ని ఇంకా బలోపేతం చేస్తుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.నాకు ఇలాంటి ఊహ రావటం పైవాడి సంకల్పం. కథకుడు అలా అనకున్నట్టు రచయిత చెపితే అదో కథ. కథకుడు బైట పెట్టనైనా వచ్చు, దాచనూ వచ్చు. అవి వేర్వేరు కథలు. దాచని కథలో ప్రకాశమే పెళ్లి జరిపించొచ్చు. అంతవరకూ నమ్మకాలరాయుడిగా ఉన్న ప్రకాశం ఆపని చెయ్యటం నమ్మకంపై అవసరం యొక్క విజయాన్ని వ్యక్తీకరిస్తుంది. ప్రొటగానిస్టు మారిపోతాడు. ఫోకస్ మరోవైపు ప్రసరిస్తుంది. ప్రకాశం పెళ్లి ఆపేయవచ్చు. ఆమీదట పెళ్లికొడుకు ఏ ఏక్సిడెంటులోనో పోతే కథకుడు హీరో ఐపోతాడు. పెళ్లి సంబంధం రద్దు అయిపోతే కథకుడు విలన్ ఐపోతాడు. వంద కారణాలు. వాడు అమెరికా పెళ్లికొడుకు అయి రెడీమేడ్ పెళ్లి చేసుకుని పోవాల్సిన పరిస్థితి.. చేసుకుందామన్న మనస్థితి.. అహం.. కథలో పాత్రల ప్రాధాన్యతా క్రమం మారిపోతూ ఉంటుంది. నమ్మకాలపై అవసరాలపై చర్చ పాఠకుడు మనసులో రేపి మా అర్నాద్ పక్కకి తప్పుకుని జరిగే తమాషా ఊహించుకోవచ్చు. ఇవన్నీ కాస్త క్లిష్టమైన కథలు. ఇవన్నీ సంఘటనల కూర్పుని బట్టీ, అదీ పాఠకుడికి చాలదనిపిస్తే డైలాగుల్లో పాత్రల చేత వాగించటమో, రచయితే – మనము ఆ ఆగంతకుని అనుసరింతము – అనే పాత ఫక్కీలో, నీతులు చెప్పెయ్యటమో చేసి సరళం చెయ్యవచ్చు.
ఈ కథ దగ్గరకే వస్తే ఇది దాచిన కథ.
దాచటంతో కథ అయిపోతే కథకుడి మంచితనాన్ని కీర్తించుకుంటూ పాఠకులు పుటలు తిప్పేస్తారు. దాచాక అది బైటపడటం కథాన్యాయమో ఏదో అవుతుంది. అదేదో న్యాయం కోసం కథ పెరిగితే నా పుటలు మింగేస్తున్నాడీ అక్కుపక్షి అనుకోవచ్చు సంపాదకుడు. ఆ భయాన్ని తొలగందోచి, మరెక్కడో కోసెయ్యవచ్చులే అని నచ్చజెప్పుకుని రచయిత ముందుకెళతాడు. ఇంకేముంది. కీడో మేలో ఏదో ఒకటి జరగాలి. ఈ కథ స్వభావాన్నిబట్టి కీడు జరగకపోటమే మేలు గదా. రామలక్ష్మి గారు కీడు జరగక్కుండా రచయిత ఆపాలని అంటున్నారు. సరేనమ్మా ఏం చెయ్యాలంటావు అంటే ఆవిడ కొన్ని ఎండింగులు ఇచ్చారు. నేనేం తక్కువ తిన్నానా అని కొన్ని చేర్చాను. అవన్నీ బైటపడే కాలానికి, బైటపడే విధానానికీ సంబంధంచిన permutations and combinations. బైటపడటం మీద అంగీకారం కుదిరింది. కొన్నేళ్ల తర్వాత బైటపడితే ప్రకాశం కథకుడి సమయస్ఫూర్తిని మెచ్చవచ్చు. తనదెంత వెర్రి నమ్మకమో అంగీకరించవచ్చు. అతనిలో పరివర్తన పాఠకుడికీ ఎక్కవచ్చు – అన్నారు. ఎన్నాళ్ల తర్వాత – అన్నాను ఆడదాని మాట చెల్లటమా అన్న మొహం పెట్టి. అదే కాస్త చల్లబడ్డాక.. అన్నారు. ఎన్నాళ్లకి చల్లబడుతుంది.. అన్నాను. ఆవిడ నా పెంకెతనానికి ఆగ్రహించబోతున్నారని గ్రహించీసి నా సీరియస్ ముఖం తొడుక్కుని అన్నాను. అది కాదోయ్ ప్రకాశం గాడు నమ్మకాల జాతి కదా.. వాడు మైల ఘడియల్లో పెళ్లి జరిగిందని తెలిసాక నువ్వు చెప్పినట్టు మారతాడా.. భయాల సంతానమే గదా మూఢ నమ్మకం… ఇంకమీదట ఎప్పుడు కీడు జరగబోతుందో అని బెంగెట్టేసుకుని తీసుకు తీసుకు వాడే చావొచ్చు.. కాలంతీరి భార్య చనిపోతే దానికి లంకె పెట్టుకోవచ్చు. అప్పుడు??? అనడిగాను. అలా ఎందుకు జరుగుతుంది.. విషయం చల్లబడింది కదా.. అన్నారావిడ కాస్త చల్లబడి. దాచాక ఇంక ప్రకాశానికి అసలు వేడి ఎక్కడెక్కింది.. లేదు గదా.. ఇహ చల్లబడ్డమేంటి ఆలోచించుమా అన్నాను. అవిడని ఆలోచనలో పడేసి నేను ఆలోచనలో పడ్డాను. కథ నమ్మకాలనుంచి పక్కకి గెంతి మనుషుల్లో మూఢులు ఉంటారన్న సరికొత్త సత్యాన్ని లేదా సత్యభ్రాంతిని బైటపడేస్తుంది గదా- అనుకన్నాను. అది మీవాడి కథకాదు గదా అని పసిగట్టీస్తుందోమో నా ఇంటి ఇల్లాలు అనుకుని..
ఈ రోజు కూరేంటి రామలచ్చమీ అన్నాను.
అర్నాద్ నమ్మకం రామలక్ష్మి అపనమ్మకం
26 శుక్రవారం జూలై 2013
Posted వివిన కబుర్లు, వివిన రచనలు
in