18-06-13న కోర్టుమార్షల్ ఏకబిగిన చదివాను. రెండంకాల హిందీ నాటకం. రచయిత స్వదేశ్ దీపక్. అనువాదం దాసరి అమరేంద్ర. ఈ పెద్దమనిషికి ఫోను చేసాను. నిన్ను తన్నాలి-అన్నాను. ఈ రచన ఇన్నాళ్లూ నా కంటపడకుండా ఎందుకు ఉంచావు- అని గదమాయించాను. తప్పే- ఒప్పేసుకున్నాడు. 65ఏళ్లు నాకు. ఈమధ్య నన్ను కూర్చోబెట్టి చదివించిన ఫిక్షన్ లేదు. చదివాక నాశరీరంలో, మనసులో కలిగిన సందడి నామీద నాకు నమ్మకం కలిగించింది. సాహిత్యం వ్యక్తి అంతరంగం మీద కలిగించగల ప్రభావంపై నమ్మకం కలిగించింది. ఈనాటకంలో రెండు ప్రధాన అంశాల మీద నా ఆలోచనలు నడిచాయి. ఒకటి ప్రపంచవ్యాప్త లేదా కాలాతీత అంశం.  సైన్య నిర్మాణం. రెండవది మన దేశపు ప్రత్యేక సమస్య. కులవ్యవస్థ. సైన్యనిర్మాణం ఎందుకు జరిగింది,  జరుగుతోంది, జరగకుండా ప్రపంచం సాగుతుందా? ఈ ప్రశ్నలు చాలా లోతైనవి. వాటిని ప్రస్తుతం పక్కన పెడదాం. చరిత్రను తీసుకుంటే సైన్యం లేని కాలం, వ్యవస్థ కనిపించవు. అలాంటి కాలం భవిష్యత్తులో రావాలని అనుకుంటే అది ఒక ఆదర్శం, స్వప్నం అవుతాయి. ఇంక సైన్యం నిర్మాణానికి, వాటి యుద్ధ విజయాలకూ అనేక అంశాలు దోహదపడతాయి. వాటిలో ప్రధానమైన వాటిలో ఒకటి క్రమశిక్షణ. ఇది పై అధికారి ఆజ్ఞని తప్పనిసరిగా అనుసరించటం అన్న రూపంలో కనిపిస్తుంది. వ్యక్తికి స్వంతవివేచన అన్నది నిషిద్ధం. దీనిని మనిషిని మనిషిగా చేసిన ఆలోచన అనేదానిపై నియంత్రణగా అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి వ్యవస్థలో పరిస్థితి ఎలా ఉంటుంది? అనుభవం ఉన్నవాళ్లు బాగా చెప్పవచ్చు. కాస్త ఆలోచించితే సామాన్యపౌరుడు కూడ కొంత గ్రహించగలిగిన విషయం. అయితే ఈ వ్యవస్థ తన లోపాలను తాను దిద్దుకోడం కూడా అనివార్యం. అందుకు ఇది న్యాయవ్యవస్థ వంటి వాటిని ఏర్పరుచుకోటం –బహుశా- ఆధునిక సైన్యనిర్మాణ పద్దతులలో ఒకటయింది. అది చేసే విచారణను కోర్టుమార్షల్ అంటారు. ఒక సామాన్య సైనికుడు ఇద్దరు అధికారులను కాలుస్తాడు. ఒకరు చనిపోతే రెండవవాడు దెబ్బతిని బ్రతుకుతాడు. దీనికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. చంపినతను తను చంపాననే అంటాడు. అయితే ఎందుకు చంపాడు? పౌరన్యాయంలో ఈ ప్రశ్నకి జవాబు నేరనిర్ధారణకి వినియోగపడుతుంది. ఇది శిక్ష పరిమితిని నిర్ణయించటానికి కూడా సహాయపడుతుంది. సైనికన్యాయంలో ఈప్రశ్నకి స్థానం ఏమిటి? అది పౌరన్యాయంలో ఉన్న స్థానానికి సమానమేనా? అదలావుంచి- సైన్యేతర సమాజంలో(పౌర సమాజం అన్న పదం కొంత వేరే అర్ధంలో వాడుతున్నందువల్ల ఈ పదం వాడాను) అనేక అవాంఛనీయ ధోరణులు గతం నుంచి వచ్చి మనభుజాల మీద కూర్చుని ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కుల వ్యవస్థ. దీనినుంచి పౌరులకు వివక్ష, అవమానం వంటివి కలగరాదని, కలిగించరాదని రాజ్యాంగ పరంగా మనం చట్టాలు చేసుకున్నాం. కలిగితే కలిగించిన వారిని నేరస్థులుగా పరిగణించి శిక్షలు వేసే అధికారాన్ని న్యాయస్థానాలకు ఇచ్చుకున్నాం. అయినా ఈ పురాతన వ్యవస్థ తొలగిపోలేదు. క్రమశిక్షణ అన్న ఇరుసు మీద నడిచే సైన్యంలోనూ మనమే ఉన్నాం. మన భుజాలమీద ఈ బరువుతోనే మనం సైనికులమవుతున్నాం. సైనిక వ్యవస్థలో అనివార్యమైన నిచ్చెనమెట్ల వ్యవస్థలో మన వర్ణవ్యవస్థ లేదా కులవ్యవస్థ పరిస్థితి ఏమిటి? ఈ నాటకం చదవితే నాకీ ప్రశ్నలు కలిగాయి. జవాబు కోసం వెదుకుతూనే ఉన్నాను. ఒక చిన్ని అభ్యంతరం కూడా మరో ప్రశ్నని నా ముందుంచింది. కులవ్యవస్థ అంటే గతం ఆధారంగా అంటే మన వర్తమానాన్ని  వ్యక్తి ప్రవర్తనకీ, శీలానికీ సంబంధంలేని గౌరవాలు, అవమానాలతో నింపుకోటం. వంశ గౌరవం, ప్రతిష్ఠ, పౌరుషాలు వంటివి కూడా అదే విత్తు ఫలాలే. ఇందులో ప్రధానపాత్ర తన న్యాయదృష్టికి మూలంగా అదే విత్తుని భావించటం కథాన్యాయానికి తప్పనిసరి విఘాతం. అది నిస్సందేహంగా మన దేశపు రచయితల, మేధావుల పరిమితి. దానిని మనం అధిగమించలేమా? ఎప్పుడు అధిగమిస్తాం?