చర్చ అనేది దాసరి అమరేంద్ర పూనికతో మా బెంగళూరు మిత్రులు కలుసుకుని కాస్తంత జ్ఞానాన్ని కలబోసుకోటానికి ఏర్పడింది. అప్పట్లో సురేశ్, పద్మావతి, శ్రీవల్లీరాధిక, అమరేంద్రలు ఇంచుమించు ఒకేమారు బెంగళూరు వదిలెయ్యటంతో అది ఆగిపోయింది. ప్రతినెలా ఓ పుస్తకం ముందే ఎంచుకుని దాన్ని అందరూ చదువుకుని  రావాలి. సంచాలకుడు అనే వ్యక్తి దాన్ని పరిచయం చేసి, తనకు తోచిన విషయాలు చర్చకు పెట్టేవారు. ఇలా పుస్తకాలే కాక కొన్ని సామాజిక అంశాలు తీసుకుని మాటలాడుకున్నాం. అందులో కులం, రాయలసీమ వ్యవసాయ ధోరణులు వగైరాలు ఉన్నాయి. ఏది మాటలాడాలన్నా ఆధారం, సమాచారం(data), గణాంకాలు( statistics) ప్రధానం. ఇళ్లలో కలుసుకునేవాళ్లం. మాలో రాసేవాళ్ల రచనలు చర్చకు నిషిద్ధాలు. పై రచయితలైనా వాళ్ల గురించి చర్చించేటపుడు ఉండకూడదు. ఈ వ్యవహారానికి సూత్రధారి అమరేంద్ర. ప్రధాన పాత్రధారులు రజనీకాంత్, రాయుడు, కవనశర్మ. రాయుడు సమాచార సేకరణకు, రజనీకాంత్ విషయ విశ్లేషణకు, కవనశర్మ ప్రశ్నలకు నిపుణులు. చర్చ పక్కదారి పట్టకుండా అమరేంద్ర కాపలా కాసేవాడు. నాలుగేళ్లు నడిచాయి. అప్పుడు రజనీకాంత్ రాసుకున్న నోట్సులు ఇప్పుడు ఏదైనా చెయ్యాలన్న ఊహ ఉంది. ఈ సమావేశాలలో కాళీపట్నం, వల్లంపాటి, సింగమనేని, బి. తిరుపతిరావు వంటివారు అతిధులుగా పాల్గొన్నారు.

నాలుగేళ్ల తర్వాత కవనశర్మ దీన్ని బ్రతికించటానికి పూనుకున్నారు. తొలి సమావేశం ఈసారి –చర్చ- ఎలా ఉండాలి మీద సాగింది. రెండు నెలలకు అంశాలు నిశ్చయించుకున్నాం.

14న మాట్లాడుకున్న అంశం వృద్ధుల సమస్యలు- సాంకేతిక పరికరాల కల్పన, గృహనిర్మాణ జాగరూకత( technological solutions and awareness in architecture of universal design for the elderly). సాంకేతిక విషయాల మీద ఆచార్య అనంత సురేశ్, గృహనిర్మాణ సమస్య మీద రాయుడు మాటలాడారు. డాక్టర్ మోహన్ సంచాలకులు. “వృద్ధుల సమస్యలు శారీరకం, మానసికం, సామాజికం. పశ్చిమ ప్రపంచం ఈ సమస్యల గురించి చాలాకాలంగా పనిచేస్తోంది. వికలాంగుల సమస్యల మీద అనేక ప్రాజెక్టులు మనదేశంలో ఉన్నా వీటిమీద లేవు. వృద్ధుల వైద్యం(geriatrics) మనదేశంలో నామమాత్రంగా ఉంది.” అంటూ వారి ఆద్వర్యంలో జరుగుతున్న కృషిని వివరించారు. పశ్చిమం తమ పరిస్థితులకి అనుగుణంగా చేసుకున్న పరికరాలు పరిచయం చేసారు. పడిపోవటం, మరపు, ఒంటరితనం, జీవనశైలి మార్పులు వంటి వాటికి తయారుచేసుకున్న పరికరాలు, సంస్థలు వివరించారు. ఇక్కడ జరగవలసిన పనిపై తన అభిప్రాయాలు చెప్పారు. తర్వాత రాయుడు ఇళ్ల నిర్మాణంలో అన్ని వయసుల వాళ్లకీ, ఆరోగ్యవంతుల నుంచి అనారోగ్యవంతుల వరకు అందరినీ దృష్టిలో పెట్టుకుని గృహనిర్మాణం జరగాలన్న చైతన్యం గురించి చెప్పారు. జనాభా విభజనలో (పనిచేసేవారు; పని చేయలేని బాలులు, వృధ్దుల మధ్య నిష్పత్తి) పశ్చిమ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ప్రస్తావించారు. 2050 నాటి అంచనా ప్రకారం భారతదేశంలో వృధ్ధుల సంఖ్య, రాబోయే అవసరాలు వివరించారు.

వారు చెప్పేది చెప్పాక, చర్చ. సామాజిక కార్యకర్తగా చురుకుగా పని చేస్తున్న ఒక మహిళా న్యాయవాది గారు వేసిన ప్రశ్నలకు సురేశ్ జపాన్ లో వృద్దులకోసం నిర్మించిన మరమనిషిని వివరించారు. గ్రామాలలో వృద్ధుల సేవలను వినియోగించుకోటం ఎలా వారి వ్యవసాయ అనుభవానికి కాలం చెల్లింది గదా అన్న నా ప్రశ్నకి ఆచార్య ఎన్.జె. రావుగారు ఈ-సాగు ప్రాజెక్టు గురించి దానిలో వృద్దులని వినియోగించుకునే వీలుని గురించి చెప్పారు. రజనీకాంత్ సాహిత్యంలో వృద్ధుల గురించి జాలిపడే కథలే గాని ఆలోచంపజేసేవి ఉన్నాయా అన్నారు. అవసరబంధాలు అనే కవనశర్మ కథ ప్రస్తావించారు. మాలతీచందూర్, కె.రామలక్ష్మి రచనలు గుర్తుచేసుకున్నారు. సాహిత్యం గతం గురించి పెట్టుకునే కన్నీళ్ల ముందు భవిష్యత్తు గురించి చేసే ఆలోచనలు తక్కువేనని నేను ఒప్పేసుకున్నాను. రామలక్ష్మి గారు మనం ఆలోచిస్తున్నది ఏ వృద్ధుల గురించి అని ప్రశ్నించి ఇది తక్కువ సంఖ్యగల మధ్యతరగతి, ధనికుల గురించేనని జవాబు రాబట్టుకుంది. ఆమీదట చర్చ ముగిసింది. రాయుడుగారిని పట్టుకుని మనం ఆసంఖ్యాక అసహాయ వృద్ధులకి ఏమైనా చెయ్యాలిగదా- అని ప్రశ్నించింది. ఆవిడ దృష్టిలో రజనీకాంత్ డిక్షనరీ, రాయుడు ఎన్సైక్లోపీడియా. ఆయన స్పష్టం చెయ్యలేనివీ, ఈయన వివరణ ఇవ్వలేనివీ ఉండవు. తప్పకుండా చెయ్యాలి మీరేం చేస్తారో చెప్పండి- అని రాయుడు అంటే నా కాళ్లే నామాట వింటంలేదు. నేనేం చెయ్యగలనని రామలక్ష్మి సమాధానం.

ఆవిడని అంతటితో ప్రశ్నలు వదలలేదు. దాన్నించి పుట్టిన కోపమూ వదల్లేదు.

“ఇంత కష్టపడి, ఏదో ఉపయోగకరమైన పని, ఆలోచన చెయ్యాలని ఇందరు వచ్చారు. ఆధిక సంఖ్యాకుల సమస్యలని వదిలేసారు. వాళ్ల సమస్యలకి (ఆరోగ్యం, మానసికం, సామాజికం) వాళ్లే మార్గాలు వెదుక్కుంటున్నారు. వాకింగులు, హెల్త్ చెకప్పులు, పనివాళ్లు, టీవీ కాలక్షేపం, భజనలు, బాబాలు ఎన్నో మార్గాలు. అలాంటి వాళ్ల కోసం ఎందుకిదంతా- వాళ్లిద్దరూ ఎందుకు ఒప్పుకున్నారు” – అందావిడ ఇంటికి వచ్చాక కోపంగా.

వ్యవసాయ సమాజం దానికి పునాది వంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, దానిని బలోపేతం చేసిన విలువలు, త్వరత్వరగా వచ్చిన పారిశ్రామిక సమాజం అది తీసుకువచ్చిన న్యూక్లియస్ కుటుంబాలు ఇంకా రూపొందని విలువలు వగైరా చెప్పబోయాను. రాయుడు గారి జీవనశైలి పరిణామ సిద్ధాంతం, పైనుంచి అభివృద్ధి ఫలాలు కిందకి జారే సిద్దాంతం వివరించబోయాను. వీటిమధ్య పుట్టిన వయో సమూహాల ప్రత్యేక సమస్యలు వాటి గురించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అంచనాలు, పరిష్కార అన్వేషణ చెప్పబోయాను.

చివరికి వాళ్లకీ, నాకూ తట్టనివీ, తెలియనివి ఉండే అవకాశం ఉందని కన్విన్స్ చేద్దామనుకున్నాను. అలా కన్విన్సవని వాళ్లు ఉంటూనే ఉంటారని నేను కన్విన్సయి గుండెలమీద చెయ్యేసుకుని గుర్రు కొట్టటం మొదలెట్టాను. ఆవిడ కోపం వంటపనిలో కలిసిపోయింది.