• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: జూన్ 2013

కోర్టుమార్షల్ కొన్ని ప్రశ్నలు

27 గురువారం జూన్ 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ 3 వ్యాఖ్యలు

18-06-13న కోర్టుమార్షల్ ఏకబిగిన చదివాను. రెండంకాల హిందీ నాటకం. రచయిత స్వదేశ్ దీపక్. అనువాదం దాసరి అమరేంద్ర. ఈ పెద్దమనిషికి ఫోను చేసాను. నిన్ను తన్నాలి-అన్నాను. ఈ రచన ఇన్నాళ్లూ నా కంటపడకుండా ఎందుకు ఉంచావు- అని గదమాయించాను. తప్పే- ఒప్పేసుకున్నాడు. 65ఏళ్లు నాకు. ఈమధ్య నన్ను కూర్చోబెట్టి చదివించిన ఫిక్షన్ లేదు. చదివాక నాశరీరంలో, మనసులో కలిగిన సందడి నామీద నాకు నమ్మకం కలిగించింది. సాహిత్యం వ్యక్తి అంతరంగం మీద కలిగించగల ప్రభావంపై నమ్మకం కలిగించింది. ఈనాటకంలో రెండు ప్రధాన అంశాల మీద నా ఆలోచనలు నడిచాయి. ఒకటి ప్రపంచవ్యాప్త లేదా కాలాతీత అంశం.  సైన్య నిర్మాణం. రెండవది మన దేశపు ప్రత్యేక సమస్య. కులవ్యవస్థ. సైన్యనిర్మాణం ఎందుకు జరిగింది,  జరుగుతోంది, జరగకుండా ప్రపంచం సాగుతుందా? ఈ ప్రశ్నలు చాలా లోతైనవి. వాటిని ప్రస్తుతం పక్కన పెడదాం. చరిత్రను తీసుకుంటే సైన్యం లేని కాలం, వ్యవస్థ కనిపించవు. అలాంటి కాలం భవిష్యత్తులో రావాలని అనుకుంటే అది ఒక ఆదర్శం, స్వప్నం అవుతాయి. ఇంక సైన్యం నిర్మాణానికి, వాటి యుద్ధ విజయాలకూ అనేక అంశాలు దోహదపడతాయి. వాటిలో ప్రధానమైన వాటిలో ఒకటి క్రమశిక్షణ. ఇది పై అధికారి ఆజ్ఞని తప్పనిసరిగా అనుసరించటం అన్న రూపంలో కనిపిస్తుంది. వ్యక్తికి స్వంతవివేచన అన్నది నిషిద్ధం. దీనిని మనిషిని మనిషిగా చేసిన ఆలోచన అనేదానిపై నియంత్రణగా అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి వ్యవస్థలో పరిస్థితి ఎలా ఉంటుంది? అనుభవం ఉన్నవాళ్లు బాగా చెప్పవచ్చు. కాస్త ఆలోచించితే సామాన్యపౌరుడు కూడ కొంత గ్రహించగలిగిన విషయం. అయితే ఈ వ్యవస్థ తన లోపాలను తాను దిద్దుకోడం కూడా అనివార్యం. అందుకు ఇది న్యాయవ్యవస్థ వంటి వాటిని ఏర్పరుచుకోటం –బహుశా- ఆధునిక సైన్యనిర్మాణ పద్దతులలో ఒకటయింది. అది చేసే విచారణను కోర్టుమార్షల్ అంటారు. ఒక సామాన్య సైనికుడు ఇద్దరు అధికారులను కాలుస్తాడు. ఒకరు చనిపోతే రెండవవాడు దెబ్బతిని బ్రతుకుతాడు. దీనికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. చంపినతను తను చంపాననే అంటాడు. అయితే ఎందుకు చంపాడు? పౌరన్యాయంలో ఈ ప్రశ్నకి జవాబు నేరనిర్ధారణకి వినియోగపడుతుంది. ఇది శిక్ష పరిమితిని నిర్ణయించటానికి కూడా సహాయపడుతుంది. సైనికన్యాయంలో ఈప్రశ్నకి స్థానం ఏమిటి? అది పౌరన్యాయంలో ఉన్న స్థానానికి సమానమేనా? అదలావుంచి- సైన్యేతర సమాజంలో(పౌర సమాజం అన్న పదం కొంత వేరే అర్ధంలో వాడుతున్నందువల్ల ఈ పదం వాడాను) అనేక అవాంఛనీయ ధోరణులు గతం నుంచి వచ్చి మనభుజాల మీద కూర్చుని ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కుల వ్యవస్థ. దీనినుంచి పౌరులకు వివక్ష, అవమానం వంటివి కలగరాదని, కలిగించరాదని రాజ్యాంగ పరంగా మనం చట్టాలు చేసుకున్నాం. కలిగితే కలిగించిన వారిని నేరస్థులుగా పరిగణించి శిక్షలు వేసే అధికారాన్ని న్యాయస్థానాలకు ఇచ్చుకున్నాం. అయినా ఈ పురాతన వ్యవస్థ తొలగిపోలేదు. క్రమశిక్షణ అన్న ఇరుసు మీద నడిచే సైన్యంలోనూ మనమే ఉన్నాం. మన భుజాలమీద ఈ బరువుతోనే మనం సైనికులమవుతున్నాం. సైనిక వ్యవస్థలో అనివార్యమైన నిచ్చెనమెట్ల వ్యవస్థలో మన వర్ణవ్యవస్థ లేదా కులవ్యవస్థ పరిస్థితి ఏమిటి? ఈ నాటకం చదవితే నాకీ ప్రశ్నలు కలిగాయి. జవాబు కోసం వెదుకుతూనే ఉన్నాను. ఒక చిన్ని అభ్యంతరం కూడా మరో ప్రశ్నని నా ముందుంచింది. కులవ్యవస్థ అంటే గతం ఆధారంగా అంటే మన వర్తమానాన్ని  వ్యక్తి ప్రవర్తనకీ, శీలానికీ సంబంధంలేని గౌరవాలు, అవమానాలతో నింపుకోటం. వంశ గౌరవం, ప్రతిష్ఠ, పౌరుషాలు వంటివి కూడా అదే విత్తు ఫలాలే. ఇందులో ప్రధానపాత్ర తన న్యాయదృష్టికి మూలంగా అదే విత్తుని భావించటం కథాన్యాయానికి తప్పనిసరి విఘాతం. అది నిస్సందేహంగా మన దేశపు రచయితల, మేధావుల పరిమితి. దానిని మనం అధిగమించలేమా? ఎప్పుడు అధిగమిస్తాం?

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

చర్చ- రామలక్ష్మి ప్రశ్న

16 ఆదివారం జూన్ 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు

≈ 7 వ్యాఖ్యలు

చర్చ అనేది దాసరి అమరేంద్ర పూనికతో మా బెంగళూరు మిత్రులు కలుసుకుని కాస్తంత జ్ఞానాన్ని కలబోసుకోటానికి ఏర్పడింది. అప్పట్లో సురేశ్, పద్మావతి, శ్రీవల్లీరాధిక, అమరేంద్రలు ఇంచుమించు ఒకేమారు బెంగళూరు వదిలెయ్యటంతో అది ఆగిపోయింది. ప్రతినెలా ఓ పుస్తకం ముందే ఎంచుకుని దాన్ని అందరూ చదువుకుని  రావాలి. సంచాలకుడు అనే వ్యక్తి దాన్ని పరిచయం చేసి, తనకు తోచిన విషయాలు చర్చకు పెట్టేవారు. ఇలా పుస్తకాలే కాక కొన్ని సామాజిక అంశాలు తీసుకుని మాటలాడుకున్నాం. అందులో కులం, రాయలసీమ వ్యవసాయ ధోరణులు వగైరాలు ఉన్నాయి. ఏది మాటలాడాలన్నా ఆధారం, సమాచారం(data), గణాంకాలు( statistics) ప్రధానం. ఇళ్లలో కలుసుకునేవాళ్లం. మాలో రాసేవాళ్ల రచనలు చర్చకు నిషిద్ధాలు. పై రచయితలైనా వాళ్ల గురించి చర్చించేటపుడు ఉండకూడదు. ఈ వ్యవహారానికి సూత్రధారి అమరేంద్ర. ప్రధాన పాత్రధారులు రజనీకాంత్, రాయుడు, కవనశర్మ. రాయుడు సమాచార సేకరణకు, రజనీకాంత్ విషయ విశ్లేషణకు, కవనశర్మ ప్రశ్నలకు నిపుణులు. చర్చ పక్కదారి పట్టకుండా అమరేంద్ర కాపలా కాసేవాడు. నాలుగేళ్లు నడిచాయి. అప్పుడు రజనీకాంత్ రాసుకున్న నోట్సులు ఇప్పుడు ఏదైనా చెయ్యాలన్న ఊహ ఉంది. ఈ సమావేశాలలో కాళీపట్నం, వల్లంపాటి, సింగమనేని, బి. తిరుపతిరావు వంటివారు అతిధులుగా పాల్గొన్నారు.

నాలుగేళ్ల తర్వాత కవనశర్మ దీన్ని బ్రతికించటానికి పూనుకున్నారు. తొలి సమావేశం ఈసారి –చర్చ- ఎలా ఉండాలి మీద సాగింది. రెండు నెలలకు అంశాలు నిశ్చయించుకున్నాం.

14న మాట్లాడుకున్న అంశం వృద్ధుల సమస్యలు- సాంకేతిక పరికరాల కల్పన, గృహనిర్మాణ జాగరూకత( technological solutions and awareness in architecture of universal design for the elderly). సాంకేతిక విషయాల మీద ఆచార్య అనంత సురేశ్, గృహనిర్మాణ సమస్య మీద రాయుడు మాటలాడారు. డాక్టర్ మోహన్ సంచాలకులు. “వృద్ధుల సమస్యలు శారీరకం, మానసికం, సామాజికం. పశ్చిమ ప్రపంచం ఈ సమస్యల గురించి చాలాకాలంగా పనిచేస్తోంది. వికలాంగుల సమస్యల మీద అనేక ప్రాజెక్టులు మనదేశంలో ఉన్నా వీటిమీద లేవు. వృద్ధుల వైద్యం(geriatrics) మనదేశంలో నామమాత్రంగా ఉంది.” అంటూ వారి ఆద్వర్యంలో జరుగుతున్న కృషిని వివరించారు. పశ్చిమం తమ పరిస్థితులకి అనుగుణంగా చేసుకున్న పరికరాలు పరిచయం చేసారు. పడిపోవటం, మరపు, ఒంటరితనం, జీవనశైలి మార్పులు వంటి వాటికి తయారుచేసుకున్న పరికరాలు, సంస్థలు వివరించారు. ఇక్కడ జరగవలసిన పనిపై తన అభిప్రాయాలు చెప్పారు. తర్వాత రాయుడు ఇళ్ల నిర్మాణంలో అన్ని వయసుల వాళ్లకీ, ఆరోగ్యవంతుల నుంచి అనారోగ్యవంతుల వరకు అందరినీ దృష్టిలో పెట్టుకుని గృహనిర్మాణం జరగాలన్న చైతన్యం గురించి చెప్పారు. జనాభా విభజనలో (పనిచేసేవారు; పని చేయలేని బాలులు, వృధ్దుల మధ్య నిష్పత్తి) పశ్చిమ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ప్రస్తావించారు. 2050 నాటి అంచనా ప్రకారం భారతదేశంలో వృధ్ధుల సంఖ్య, రాబోయే అవసరాలు వివరించారు.

వారు చెప్పేది చెప్పాక, చర్చ. సామాజిక కార్యకర్తగా చురుకుగా పని చేస్తున్న ఒక మహిళా న్యాయవాది గారు వేసిన ప్రశ్నలకు సురేశ్ జపాన్ లో వృద్దులకోసం నిర్మించిన మరమనిషిని వివరించారు. గ్రామాలలో వృద్ధుల సేవలను వినియోగించుకోటం ఎలా వారి వ్యవసాయ అనుభవానికి కాలం చెల్లింది గదా అన్న నా ప్రశ్నకి ఆచార్య ఎన్.జె. రావుగారు ఈ-సాగు ప్రాజెక్టు గురించి దానిలో వృద్దులని వినియోగించుకునే వీలుని గురించి చెప్పారు. రజనీకాంత్ సాహిత్యంలో వృద్ధుల గురించి జాలిపడే కథలే గాని ఆలోచంపజేసేవి ఉన్నాయా అన్నారు. అవసరబంధాలు అనే కవనశర్మ కథ ప్రస్తావించారు. మాలతీచందూర్, కె.రామలక్ష్మి రచనలు గుర్తుచేసుకున్నారు. సాహిత్యం గతం గురించి పెట్టుకునే కన్నీళ్ల ముందు భవిష్యత్తు గురించి చేసే ఆలోచనలు తక్కువేనని నేను ఒప్పేసుకున్నాను. రామలక్ష్మి గారు మనం ఆలోచిస్తున్నది ఏ వృద్ధుల గురించి అని ప్రశ్నించి ఇది తక్కువ సంఖ్యగల మధ్యతరగతి, ధనికుల గురించేనని జవాబు రాబట్టుకుంది. ఆమీదట చర్చ ముగిసింది. రాయుడుగారిని పట్టుకుని మనం ఆసంఖ్యాక అసహాయ వృద్ధులకి ఏమైనా చెయ్యాలిగదా- అని ప్రశ్నించింది. ఆవిడ దృష్టిలో రజనీకాంత్ డిక్షనరీ, రాయుడు ఎన్సైక్లోపీడియా. ఆయన స్పష్టం చెయ్యలేనివీ, ఈయన వివరణ ఇవ్వలేనివీ ఉండవు. తప్పకుండా చెయ్యాలి మీరేం చేస్తారో చెప్పండి- అని రాయుడు అంటే నా కాళ్లే నామాట వింటంలేదు. నేనేం చెయ్యగలనని రామలక్ష్మి సమాధానం.

ఆవిడని అంతటితో ప్రశ్నలు వదలలేదు. దాన్నించి పుట్టిన కోపమూ వదల్లేదు.

“ఇంత కష్టపడి, ఏదో ఉపయోగకరమైన పని, ఆలోచన చెయ్యాలని ఇందరు వచ్చారు. ఆధిక సంఖ్యాకుల సమస్యలని వదిలేసారు. వాళ్ల సమస్యలకి (ఆరోగ్యం, మానసికం, సామాజికం) వాళ్లే మార్గాలు వెదుక్కుంటున్నారు. వాకింగులు, హెల్త్ చెకప్పులు, పనివాళ్లు, టీవీ కాలక్షేపం, భజనలు, బాబాలు ఎన్నో మార్గాలు. అలాంటి వాళ్ల కోసం ఎందుకిదంతా- వాళ్లిద్దరూ ఎందుకు ఒప్పుకున్నారు” – అందావిడ ఇంటికి వచ్చాక కోపంగా.

వ్యవసాయ సమాజం దానికి పునాది వంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, దానిని బలోపేతం చేసిన విలువలు, త్వరత్వరగా వచ్చిన పారిశ్రామిక సమాజం అది తీసుకువచ్చిన న్యూక్లియస్ కుటుంబాలు ఇంకా రూపొందని విలువలు వగైరా చెప్పబోయాను. రాయుడు గారి జీవనశైలి పరిణామ సిద్ధాంతం, పైనుంచి అభివృద్ధి ఫలాలు కిందకి జారే సిద్దాంతం వివరించబోయాను. వీటిమధ్య పుట్టిన వయో సమూహాల ప్రత్యేక సమస్యలు వాటి గురించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అంచనాలు, పరిష్కార అన్వేషణ చెప్పబోయాను.

చివరికి వాళ్లకీ, నాకూ తట్టనివీ, తెలియనివి ఉండే అవకాశం ఉందని కన్విన్స్ చేద్దామనుకున్నాను. అలా కన్విన్సవని వాళ్లు ఉంటూనే ఉంటారని నేను కన్విన్సయి గుండెలమీద చెయ్యేసుకుని గుర్రు కొట్టటం మొదలెట్టాను. ఆవిడ కోపం వంటపనిలో కలిసిపోయింది.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

నాకు నచ్చిన వ్యాసం

08 శనివారం జూన్ 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, Uncategorized

≈ 1 వ్యాఖ్య

అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య పుస్తక సంస్కృతి అనే వ్యాసం చదివారా?
చదవకపోతే వెంటనే చదవండి. చదివితే మళ్లీ చదవండి.అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య పుస్తక సంస్కృతి

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: