ట్యాగులు

,

పాపం! మంచావిడ. భార్య కదా- ఏదోలా అనబుద్దేస్తుంది. ఎప్పుడయిందంటే 1972 ఆగస్టు 12న. అప్పటికే నేను తిక్కలాడిని. కార్లో ఊరేగుతూ -నాకు మంత్ర, తంత్రాల బలం మీద కించిత్తైనా నమ్మకం లేదు. నిన్ను మీ నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లాయిల నుంచి విడదీస్తున్నాను. ఆ బంధాలన్నీ నేనే అవటానికి నా శాయశక్తులా పనిచేస్తాను. ఈ మాట ఇవ్వటమే పెళ్లి. – అంటూ చేతిలో చెయ్యేసాను. అలా మొదలయింది మా నడక.

అప్పటికే ఆవిడ రచనలు అచ్చయ్యాయి అధ్యయ్ అన్న హిందీ పత్రికలో. నేను రాసేను గాని నాకు తెలిసి అచ్చుకి పంపలేదు. హిందీ టీచర్ గా కొంతకాలం పనిచేసింది.

నడవటం మొదలెట్టాక కష్టాలు, సుఖాలు సహజం గదా! అప్పట్లో కష్టాలు చాలావరకూ ఆర్ధికం. ఆ చాలీచాలని వనరులని ఎంతవరకూ తొలికుటుంబానికి (మగవాని తలి్దండ్రులూ, తోడబుట్టిన వారితో కూడినది) ఎంతవరకూ కుటుంబానికి ( మగవాని బార్య, బిడ్డలు) అన్నదీ ఆనాటి ప్రధాన ధర్మసంకటం. కాక మానసిక ఆనందాలు వాటి ఖరీదులు. నాతో ఆవిడ ప్రత్యేక కష్టాలు రచనా సమయంలో నా మనోస్థితి, జీవితంలో ప్రయోగ తత్వాలు. అవి అనుకున్నంత సామాన్యమైనవిగావు. అనుభవైకవేద్యాలు.

అవి ఆమె అనుభవించిందా, ఆకళింపు చేసుకుందా, తన వ్యక్తిత్వ నిర్మాణంలో భాగం చేసుకుందా అన్నవి అర్ధవంతమైన ప్ర్రశ్నలు. వాటికి మూలకారకుడిగా నేను సమాధానం చెప్పటం ఉచితం కాదు. కాని నా అభిప్రాయమే చెప్పవలసివస్తే మేమిద్దరం ఒకరి నిర్మాణానికి ఒకరు తోడయాం.

92లో ఆవిడ కథలు రాయటం మొదలయింది. రావిశాస్త్రి గారి ఉపన్యాసం దానికి ప్రేరణ అంటుంది ఆమె. వీరబాహుడు అన్న ఆకథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది రావిశాస్త్ర్రి గారు పుట్టినరోజు సంబంధిత వ్యాసం వెనక ముద్రింపబడిందని సంతోషం రామలక్ష్మి గారికి.

ఆవిడ కథలలో నాకు నచ్చినవి నాకూ విశ్రాంతి కావాలి, ముక్తి, వెలి వంటివి. స్కాన్ చేసి త్వరలోనే మీ అభిప్రాయాల కోసం ఈ బ్లాగుకి చేరుస్తాను.