24 May 2013
97లో కథానిలయం ఏర్పడింది. దీని గురించి సాహిత్యజీవులకి తెలుసనే నా భావన. దానిలో తెలుగు కథా సేకరణ నడుస్తోంది. అందులో పని కొంత నేను ఎత్తుకున్నాను.
ప్రస్తుతం ఆ పనిలో భాగంగా కృష్ణాపత్రిక పరిశీలన చేస్తున్నాను. ఈ పత్రిక 1903లో ఏర్పడింది. తమిళులు, మళయాళీలు ఏర్పరచుకున్న ఆ కాలపు పత్రికలు ఇంకా నడుస్తున్నాయని వింటున్నాను. కాని తెలుగు భాషలో అపారమైన విజయం సాధించిన పత్రికలన్నీ చిత్రంగా కాలగర్భంలో కలిసిపోయాయి. దీనికి కారణాలు ఆలోచించాలి.
అదలావుంచి,
ఈ నా ప్రస్తుత పరిశీలనలో నన్ను అబ్బురపరచిన, నాకు ఆసక్తి కలిగించిన కొన్ని సామాజిక విషయాలను నేను జాగ్రత్త చేస్తున్నాను. వాటిలో కొన్నింటిని కొంత పరిచయం చేస్తూ పాత పత్రికలు అనే కేటగిరీలో ఉంచుతాను. శ్రీపాద వారి వ్యాసం 1928 సమదర్శని అనే పత్రికలోది ఇంతకు ముందే చేర్చాను. వీటిపై సహ ఆలోచనాపరుల స్పందనను బట్టి కొనసాగిస్తాను.
కందుకూరి, గురజాడల కాలపు సాహిత్యం గమనిస్తే వేశ్యావృత్తి పట్ల ఆనాటి సమాజపు ఆలోచనలు మనం అర్ధం చేసుకోగలం. చాలాకాలంగా భారతదేశంలో విద్యతో, కళలతో సంబంధమున్న స్త్రీలు ఈ వేశ్యావృత్తిలోనే కనిపిస్తారు. అంతేకాక ప్రాశ్చాత్యుల సామీప్యత కూడా వీరికే తొలిగా లభించింది. అయితే వీరి గొంతు చాలా తక్కువగా వినిపిస్తుంది. బెంగళూరు నాగరత్నమ్మ వంటి పేర్లు ఒకటీ అరా వినిపిస్తాయి. ఎందువల్ల?
చింతామణులూ, మధురవాణులూ పురుషుల చిత్రణే గదా!. అక్షరాస్యతకీ. ఏదోవిధమైన విద్యకీ అవకాశంగల ఈ మహిళలు ఏమీ మాటలాడలేదా?
ఈ ప్రశ్న కొంతకాలంగా నన్ను వెన్నాడుతోంది.
ఆ వెదుకులాటలో –
లభించిన వాటిలో ఇది ఒక లేఖ. ఇది 22 ఏప్రిల్ 1910 కృష్ణాపత్రికలో ప్రచురించబడింది.(blog 1)